తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చాలా ఆశలే పెట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లగలిగిన ఏకైక నాయకుడు తానేనని రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానంతో పిసిసి అధ్యక్ష పదవి గురించి అనేకసార్లు రేవంత్ చర్చించారు. అయితే అధిష్టానం మాత్రం పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే విషయంలో ఎటువంటి హామీ ఇప్పటి వరకు రేవంత్ కు ఇవ్వలేదు . మరోవైపు పిసిసి అధ్యక్ష పదవి రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి హనుమంత రావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇలా చాలా మంది పోటీ పడుతున్నారు. 


ఎవరికి వారు అధిష్టానం దగ్గర తమ పలుకుబడిని ఉపయోగించి పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వకుండా ఇంకా వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి వర్గం అధిష్టానంపై గుర్రుగా ఉంది. రేవంత్ కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉనికితో ఉందని లేకపోతే గ్రూప్ రాజకీయాలతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని వారు అధిష్టానానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఒకవేళ రేవంత్ కాకుండా మరెవరికైనా అధిష్టానం పిసిసి అధ్యక్ష పదవి అప్పగిస్తే, రేవంత్ బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్టు గా కూడా ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. 

IHG


ఇప్పటికే బిజెపి రేవంత్ ను తమ పార్టీ లోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవసరమైతే ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు కబురు పంపినట్లు తెలుస్తోంది. రేవంత్ కూడా పిసిసి అధ్యక్ష పదవి దక్కకపోతే కాంగ్రెస్ లో తనకు రాజకీయంగా పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదని, గ్రూప్ రాజకీయాలతో పార్టీ తెలంగాణలో మళ్ళీ పునర్వైభవం సాధించడం అసాధ్యమనే  భావనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బిజెపి వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. 


తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు ఎక్కువగా ఉండడం, కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో, తనకు తన రాజకీయ జీవితానికి ఎటువంటి డోకా ఉండదు అని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్షుడు ఎంపిక పై నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయం రేవంత్ కు అనుకూలంగా లేకపోతే, ఆయన బీజేపీ లోకి వెళ్లడం మాత్రం తప్పదు అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: