వైసీపీ ప్రభుత్వం ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని వారికి, ఇళ్లు లేని పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రభుత్వ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా స్థలాలను గుర్తించి పట్టాలను సిద్ధం చేస్తున్నారు. కానీ కొన్ని జిల్లాలలో స్థలాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. 
 
కొన్ని జిల్లాల్లో తమ స్థలాలను అక్రమంగా అధికారులు లాక్కుంటున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. సీఎం జగన్ గుంటూరు, విజయవాడ జిల్లాలలోని పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై వివాదం రేగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఈ వివాదం గురించి స్పందించారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో వివాదాలు లేకుండా చూడాలని పవన్ కోరారు. 
 
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ జరిగిందని ఆ భూములను ఇతర అవసరాలకు కేటాయిస్తే వివాదాలు చెలరేగుతాయని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే పేదలకు ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తున్నారని... ప్రభుత్వం ఆ భూములనే పట్టాలుగా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమేనని విమర్శలు చేశారు. 
 
ప్రభుత్వం రాజధాని కొరకు రైతులు ఇచ్ఛిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తుందని అన్నారు. పాఠశాల మైదానాలను, స్మశాన భూములను, అసైన్డ్ భూములను ప్రభుత్వం ఇళ్ల స్థలాలుగా మారుస్తోందని ప్రభుత్వానికి ఈ పథకంపై చిత్తశుద్ధి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని భూములను లబ్ధిదారులకు ఇస్తే పేదలు చట్టపరమైన చిక్కులతో ఇబ్బందులు పడతారని చెప్పారు.        

మరింత సమాచారం తెలుసుకోండి: