ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోగా మృతుల సంఖ్య 27కు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న అర్ధరాత్రి సమయానికి హింసాత్మక ఘటనలు తగ్గగా హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేయడంతో పరిస్థితులలో మార్పు వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. 
 
సుప్రీం కోర్టు అల్లర్లను అదుపు చేయటంలో పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం రోజున ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల వలన రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పటంతో కనిపిస్తే కాల్చివేత ఆర్డర్ జారీ అయింది. 
 
ఈ అల్లర్లలో 50 మంది పోలీసులు గాయపడగా 260 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కేంద్రం రతన్ లాల్ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వటంతో పాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. 
 
ఈశాన్య ఢిల్లీలోని గోకుల్ పురిలో చెలరేగిన ఘర్షణల్లో విధులు నిర్వహిస్తున్న రతన్ లాల్ బుల్లెట్ గాయం వలన మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు రతన్ ను అమరవీరుడిగా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే స్పందించి అమరవీరుడి హోదా ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు లేఖ ద్వారా రతన్ లాల్ భార్యకు ప్రగాఢ సంతాపం తెలిపారు.                       
 

మరింత సమాచారం తెలుసుకోండి: