ఏపీ సీఎం వైయస్ జగన్ కొన్ని నెలల క్రితం తీసుకున్న సంచలన నిర్ణయం రాష్ట్రంలో అమలులోకి రానుంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ న్యాయ విభాగ కార్యదర్శి జి మనోహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాలో 2, పశ్చిమ గోదావరిలో 2, విజయనగరం జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 3, కృష్ణాలో 2, గుంటూరు జిల్లాలో 12, తూర్పు గోదావరిలో 1, అనంతపురం జిల్లాలో 2, చిత్తూరులో ఒక గ్రామ న్యాయాలయం ఏర్పాటు కానుంది. 
 
జూనియర్ సివిల్ జడ్జి లేదా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అధికారి గ్రామ న్యాయాలయానికి గ్రామ న్యాయాధికారిగా ఉంటారు. న్యాయాధికారితో పాటు సూపరిండెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, అఫీస్ సబార్డినేట్ లు ఉండనున్నారు. ప్రభుత్వం ఒక్కో గ్రామ న్యాయాలయానికి జీతాలు, ఇతర ఖర్చుల కింద 27.60 లక్షలు చెల్లించనుంది. గ్రామ న్యాయాలయాల చట్టం - 2008 కింద గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు కానున్నాయి. 
 
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు కానున్నాయి. కేంద్రం దేశవ్యాప్తంగా గ్రామ న్యాయాలయాల ఏర్పాటు కోసం చట్టం చేసింది. కేంద్రం ఈ చట్టాన్ని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు న్యాయపరమైన సమస్యలు ఉంటే లోకల్ గానే న్యాయం జరగాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. రాష్ట్ర కేబినేట్ కొన్ని నెలల క్రితం గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 
 
త్వరలోనే ప్రజలకు గ్రామ న్యాయాలయాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ న్యాయాలయాలకు గ్రామాల్లో జరిగే సివిల్, క్రిమినల్ కేసులు, 2 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులను మాత్రమే విచారించి తీర్పు చెప్పే పరిధి ఉంటుంది. పొలం సరిహద్దు వివాదాలు, నీటి పంపిణీ దగ్గర వచ్చే వివాదాలు, కాలువ గట్టు కేసులు, స్థలం తగాదా కేసులను గ్రామ న్యాయాలయాలు విచారించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: