మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తు రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలకు బయటనుండి మద్దతు ఎందుకు రావటం లేదో ఇపుడు అందరికీ అర్ధమైపోయింది. పేదలకు ఇళ్ళపట్టాలను ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే అమరావతి ప్రాంతంలో కూడా 1251 ఎకరాలను కేటాయించారు. సుమారు 54 వేలమంది నిరుపేదలకు పట్టాలు ఇవ్వటానికి రాష్ట్రప్రభుత్వం రంగం రెడీ చేసింది.

 

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా తమ భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వటానికి వీల్లేదంటూ హై కోర్టును ఆశ్రయించారు. ఇక్కడే వీళ్ళ మనస్తత్వం ఏమిటో బయటపడిపోయింది. రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు ఉండకూడదంటూ అమరావతి ప్రాంత రైతులు నిర్ణయించుకున్నట్లున్నారు. రాజధాని నిర్మాణానికంటే తమ భూములిచ్చాం కానీ పేదలకు పట్టాలు ఇవ్వటానికి కాదంటూ వితండ వాదన మొదలుపెట్టారు.

 

వీళ్ళ ఆర్గ్యుమెంటే కరెక్టని కాసేపు  అనుకుందాం. మరి వీళ్ళ భూముల్లో రాజధాని కట్టకుండా ప్రైవేటు సంస్ధలకు, కంపెనీలకు, ప్రభుత్వ రంగ కార్యాలయాలకు ఎకరాలు కేటాయించినపుడు ఇదే రైతులు ఎందుకు ఆందోళన చేయలేదు ? వీళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ భూముల్లో రాజధాని నిర్మాణాలు మాత్రమే జరగాలి కదా ? మరి అప్పుడు వ్యతిరేకించని రైతులు పేదలకు పట్టాల పంపిణి అంటేనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ?

 

ఎందుకంటే పరిశ్రమలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు వందల ఎకరాలు కేటాయిస్తే తమ భూముల ధరలు రోజు రోజుకు పెరిగిపోతాయి. అదే పేదలకు పట్టాలిస్తే ధరలు పెరగవు. పైగా మురికివాడలని ధరలు తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇక్కడ రైతులు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లాగానే ఆలోచిస్తున్నారు. తమ  భూముల ధరలు మాత్రం కోట్లరూపాయలకు చేరుకోవాలని అనుకుంటున్నారు. అందుకనే పేదలకు పట్టాలు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాజధాని రైతుల్లోని ఇటువంటి ఆలోచనలు అర్ధమయ్యే వీళ్ళ ఆందోళనలకు ఇతర ప్రాంతాల్లో కాదుకదా కనీసం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మిగిలిన ప్రాంతల జనాలు కూడా మద్దతుగా నిలబడలేదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: