ఏపీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఇంటర్ లో విద్యార్థులకు గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. . ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ లో గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇస్తామని ప్రకటించారు. నిన్న సచివాలయంలో ఆదిమూలపు సురేష్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల కొరకు 2900 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 
 
పదవ తరగతి పరీక్షల్లో, విద్యార్థుల హాల్ టికెట్లలో కొన్ని మార్పులు చేశామని మంత్రి చెప్పారు. పదవ తరగతి విద్యార్థుల హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు. పరీక్షలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇన్విజిలేటర్లుగా నియమించుకుంటున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో కేవలం చీఫ్ సూపర్ వైజర్ దగ్గర మాత్రమే మొబైల్ ఫోన్ ఉంటుందని అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తామని అన్నారు. 
 
ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం 1411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మార్చి 4వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని 10,64,442 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. పదో తరగతి పరీక్షలు మార్చి 23వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయని 6,30,000 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారని చెప్పారు. 
 
పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇకనుండి ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలో గ్రేడింగ్ తో పాటు మార్కులు పొందుపరుస్తారు. గ్రేడింగ్ విధానం వలన ఇతర రాష్ట్రాలలో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం జగన్ సూచనల మేరకు ఇంటర్ లో గ్రేడింగ్ తో పాటు మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: