రాష్ట్రంలో తొలి సహకార చక్కెర పరిశ్రమ చరిత్రలో కలిసిపోనుందా ? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి. ప్రపంచానికి తీపినందించిన కోవూరు చక్కెర పరిశ్రమ ఆరేళ్ల నుంచి దింపుడు కల్లం ఆశతో బతుకుతోంది. ప్రభుత్వం మారినప్పుడల్లా ఆధునికీకరిస్తామని హామీలు ఇస్తున్నా,  అమలు జరగడం లేదు. కార్మికులకు సుమారు 20 కోట్ల బకాయిలున్నాయి. మా జీతాలు మాకివ్వండి బతక లేకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

కోవూరు చక్కెర ఫ్యాక్టరీ రాష్ట్రంలోనే తొలి సహకార రంగంలో నిర్మించిన తొలి పరిశ్రమ. ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. 1979లో అప్పటి ప్రభుత్వం కోవూరు సమీపంలోని 126 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు  కోవూరు ప్రాంతంలో కేవలం వరి మాత్రమే రైతులు సాగుచేసే పరిస్థితి ఉండేది. అప్పటి నుంచి చెరకు సాగుకు ముందుకొచ్చారు. మంచి ఆదాయం వస్తుండటంతో పెద్ద ఎత్తున రైతులు వరిని వదిలి చెరుకు వైపు వచ్చారు. అప్పటి నుంచి కోవూరు చక్కెరకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. దేశ, విదేశాలకు ఇక్కడ నుంచి చక్కెర ఎగుమతులు జరిగేవి.  

 

1980లో వివిధ కారణాల రీత్యా మూతపడింది. మళ్లీ 1981-82 లో తిరిగి ప్రారంభమైంది. 1992 నుంచి జిల్లాలో ఆక్వా సాగు ప్రారంభమైంది. లాభాలు అధికంగా ఉండడంతో రైతాంగం వరి, చెరకు సాగును వదిలి ఆక్వా సాగువైపు వెళ్లారు. ఇదే సమయంలో కోవూరు చక్కెర పరిశ్రమను ఆధునికీకరించారు. చెరకు అందుబాటులోకి రాకపోవడంతో 2000లో మళ్లీ చక్కెర పరిశ్రమ మూతపడింది. ఈ సమయంలోనే కోట్ల రూపాయలు విలువచేసే ఈ పరిశ్రమను అమ్మకానికి పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. 

 

2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చక్కెర పరిశ్రమను పున:ప్రారంభించారు. 2013 మార్చి 31 వరకు నడిచి మళ్లీ మూతపడింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిశ్రమను అదుకుంటారని కార్మికులు ఆశపడ్డారు. అప్పటికే రైతులకు 5 కోట్ల వరకు బకాయిలున్నాయి. వాటిని మాత్రమే అప్పటి ప్రభుత్వ హయంలో  చెల్లించారు.

 
 
వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఇబ్బందుల్లోని చక్కెర పరిశ్రమలను పున:ప్రారంభిస్తామని ప్రకటించారు. ఐదు నెలల క్రితమే ఈ ప్రకటన చేసినా అందులో కోవూరు పరిశ్రమకు స్థానం దక్కలేదు. తాజాగా సీఎం జగన్ సహాకార చక్కెర ప్యాక్టరీల పై జరిపిన సమీక్షలో కోవూరు ప్యాక్టరీ ఊసేలేదు.విశాఖ జిల్లాలోని అనకాపల్లి, కడప జిల్లా చెన్నూరు, చిత్తూరు జిల్లాలోని గాజులమండ్యం పరిశ్రమలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.  దీంతో స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కూమార్ రెడ్డి సిఎం వద్దకు వెళ్ళి ప్యాక్టరీ సమస్య ప్రస్తావించగా, ఇక్కడికి కూడా త్రిమ్యాన్ కమిటిని పంపారు. కమిటి రావడం పోవడం జరిగింది.ఫలితం మాత్రం రావడం లేదని స్థానికులు అంటున్నారు. 

 

కోవూరు చక్కెర పరిశ్రమలోని పనిచేసిన కార్మికులకు 20 కోట్లు బకాయిలున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లోనూ ఉన్నాయి.మృతి చెందిన కార్మిక కుటుంబాలకు, రిటైర్డ్‌ కార్మికులు, ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు బకాయిలున్నాయి. ప్రస్తుతం 50 మంది కార్మికులు రోజు ఫ్యాక్టరీకి వెళ్లి వస్తున్నారు. 2013 మే నుంచి కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. ఇటీవల నెల్లూరు-ముంబై జాతీయ రహదారి విస్తీరణలో భాగంగా ఫ్యాక్టరీకి చెందిన రెండెకరాలను భూమిని తీసుకున్నారు. అందుకోసం  కోటి 80లక్షలు పరిహారంగా అందజేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: