చంద్రబాబు ఆయన టీం ఎపుడూ ఒకేటే మాట అంటూ ఉంటుంది. అది విశాఖ వాసులు చాలా మంచివాళ్ళు అని వారికి ఆ ట్యాగ్ తగిలించి పబ్బం గడుపుకోవడం తమ్ముళ్ళకు, వారి నాయకులకు అలవాటు అయిపోయింది. నిజానికి బిస్కట్లు ఇచ్చేసి ఏపీలో అతి పెద్ద సిటీని మూలకు తోసేయడం బాబుకు అలవాటుగా మారింది.

 

విశాఖకు ఏం చేశారు బాబూ అని జనం అడిగితే తప్పు. ఎందుకంటే బాబు ద్రుష్టిలో విశాఖ వాసులు చాలా మంచి వాళ్ళు కాబట్టి ఏమీ అడగకూడదు. ఆఖరుకు తమ ప్రయోజనాలు పూర్తిగా పోతున్నా కూడా నోరెత్తకూడదు. ఇది ఓ విధంగా చెప్పుకోవాలంటే ఇది పక్కా  ఫ్యూడల్ మనస్తత్వమే.

 

పేరుకు ప్రజాస్వామ్యంగా ఉంటున్నా బాబు చెప్పినట్లుగా మంచితనం ముసుగు తగిలించుకుని వైజాగ్ జనం మిన్నకుండిపోవాలి. వారి కాలి  కిందా భూమి కదిలినా కూడా కిక్కురుమనకూడదు. విశాఖకు మెట్రో రైలు రాకున్నా, ఇక్కడకు ఐటీ, సినీ పరిశ్రమలు రాకున్నా, టూరిజం ప్రాజెక్టులు రాకున్నా కూడా ఏమీ అనకూడదు, అడగకూడదు, ఎందుకంటే వారు చాలా మంచి వారు కాబట్టి.

 

ఎంత మంచి వాళ్ళు కాకపోతే విభజన తరువాత అతి పెద్ద సిటీ అని బాబు స్వయంగా చెప్పి తన మంత్రివర్గం తొలి సమావేశాన్ని ఇక్కడ పెట్టుకున్నారు. నాడు బాబు వైఖరి చూసిన విశాఖ జనం రాజధాని ఇక్కడే పెడతారు అనుకున్నారు.

 

కానీ విశాఖను కేవలం అంతర్జాతీయ‌, జాతీయ సదస్సులకు వాడుకుంటూ అందరికీ విశాఖ సిటీనే చూపించి సోకు చేస్తూ అమరావతిని మాత్రం రాజధానిగా చేసిన బాబు కుటిల నీతిని తెలిసినా విశాఖ జనం ఏమనలేదు. అందుకే బాబుకు  విశాఖ వాసులు మంచివాళ్ళు అయ్యారు.

 

కానీ అదే జనం ఇపుడు విశాఖని జగన్ సర్కార్ రాజధానిగా ప్రకటించాక కూడా ఇంకా బాబు మభ్యపెట్టాలని చూస్తే, విశాఖకు రాజధాని ఎందుకు దండుగ. విశాఖలో ఎవరు  రాజధాని అడిగారని వెటకారంగా మాట్లాడితే కూడా ఊరుకోవాలా. మంచోళ్ళు అన్న ట్యాగ్ తగిలించుకుని ఇంట్లో పడుకోవాలా. 

 

అందుకే వారు రోడ్లపైకి వచ్చారు. బాబుని ఎయిర్ పోర్టు నుంచి బయటకు రానివ్వకుండా చేశారు. బాబునే కాదు, టీడీపీని కూడా పుట్టిన దగ్గర నుంచి ఆదరించిన అదే జనం ఇపుడు తిరగబడ్డారు. చేతికి అందిన ముద్దను నోటికి దక్కకుండా చేస్తున్న బాబు అండ్ కో దాష్టికంపైన మూడవ కన్నే తెరిచారు. అందుకే బాబు అలా షాక్ తినాల్సివచ్చింది. ఎంతైనా విశాఖ వాసులు మంచోళ్ళు కదా. ఇపుడు కూడా తమ్ముళ్ళు ఆ మాట  అంటే బాగుంటుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: