రాజ‌ధాని న‌గ‌రంగా భాసిల్లుతున్న అదిపెద్ద జిల్లా గుంటూరులో రాజ‌కీయాలు ప్ర‌తి పార్టీకి క‌లిసి వ‌స్తాయి. గ‌తంలో ఇక్క‌డ చ‌క్రం తిప్పిన టీడీపీని కాద‌ని, రాజ‌ధాని న‌గ‌రంగా ఈ జిల్లాను ఎంపిక చేసిన పార్టీని కూడా వ‌ద్ద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీకి భారీ ఎత్తున మెజారిటీ క‌ట్ట‌బెట్టారు. ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే స్థానాలు మిన‌హా పూర్తిగా వైసీపీకి పూర్తి విజ‌యం అందించారు. జిల్లా టీడీపీలో యోధానుయోధులుగా చెప్పే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, జీవి.ఆంజ‌నేయులు, ధూళిపాళ్ల న‌రేంద్ర‌, ఆల‌పాటి రాజా, కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, ప్ర‌త్తిపాటి పుల్లారావు, నారా లోకేష్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, న‌క్కా ఆనంద్‌బాడు, డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ ఇలా మ‌హామ‌హులు అంద‌రూ జ‌గ‌న్ గాలిలో ఘోరంగా ఓడిపోయారు.

 

అలాంటి జిల్లాలో మ‌రింత‌గా దూసుకుపోయి.. క‌లిస‌క‌ట్టుగా పార్టీని డెవ‌ల‌ప్ చేయాల్సిన నాయ‌కులు అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో కాలం వెళ్ల‌దీస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గుంటూరులోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో తొలిసారి ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నిక‌ అయిన‌వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఆదిలో తొలి ఆరు మాసాలు వీరు ఒకింత ఒబ్బిడిగానే ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర్వాత తర్వాత మాత్రం తామే పెద్ద‌నాయ‌కుల‌మ‌నే రేంజ్‌లో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సీనియ‌ర్ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. త‌న‌దైన రేంజ్‌లో గ్రూపులు క‌డుతున్నారు.

 

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొన‌డంలో అస‌లు ఇంత పెద్ద జిల్లాలో వైసీపీ గెల‌వ‌డ‌మే ఒక రికార్డ‌యితే.. ఇప్పుడు ఆ రికార్డును నిల‌బెట్టుకోకుండా ఇలా సొంత గ్రూపులు పెట్టుకుని అంత‌ర్గ‌త కుమ్ములాటల‌కు తెర‌దీయడం అంత భావ్యం కాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ, ఎంపీ నందిగం సురేశ్‌లు ఒక వ‌ర్గంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయలు, తాడికొండ ఎమ్మెల్యే డాక్ట‌ర్ శ్రీదేవిలు మ‌రో వ‌ర్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, మిగిలిన నాయ‌కులు ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

దీంతో జిల్లా రాజ‌కీయాలు ప‌ట్టు త‌ప్పుతున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఒక‌రిప ఒక‌రు దాడులు కూడా చేసుకోవ‌డం ఇటీవ‌ల ప‌రిణామాల్లో మ‌రింత‌గా క‌ల‌వ‌రం పుట్టిస్తోంది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ రాజ‌కీయాల‌ను త‌క్ష‌ణ‌మే స‌రిదిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్లు సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: