అధికారంలో ఉండే ఏ పార్టీ అయిన పథకాలు అమలు చేసేటప్పుడు తమకు ఎంత లబ్ది చేకూరుతుందనేదే ఎక్కువ చూసుకుంటుంది. ఏ పథకం పెడితే ఏ వర్గం ఓట్లు పడతాయి అనే లెక్కలే ఎక్కువ వేసుకుంటారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎక్కువ అలాగే చేశాయి. అటు పక్కనే ఉన్న తెలంగాణలో కేసీఆర్ కూడా రాజకీయ లబ్ది లేకుండా పథకాలు ఎలా పెడతామని ఒకానొక సందర్భంలో చెప్పారు కూడా. రాజకీయ పార్టీ అన్నాక ఆ మాత్రం చేయకపోతే పార్టీ నడపడం కష్టమని వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.

 

అయితే ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం అలా కనపడటం లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బోలెడు పథకాలు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఆ పథకాలని కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అందిస్తూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పిల్లల మీద ప్రేమతో చాలా పథకాలు తీసుకొచ్చారు. పిల్లలు అందరికీ మేనమామగా మారిపోయి, వారికి ఇప్పుడు భవిష్యత్ ఇస్తే, రేపటి రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంతో  దేశంలో లేని విధంగా పథకాలు తీసుకొచ్చారు.

 

ఊహించని విధంగా ఈ 9 నెలల్లోనే పిల్లల సంక్షేమం కోసం బోలెడు పథకాలు తెచ్చారు. మొదటే బడి పిల్లలకు ఉచిత సైకిళ్ళు ఇచ్చారు. తర్వాత నాడు -నేడు కార్యక్రమం పెట్టి పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇక అమ్మఒడి ద్వారా ప్రతి పేద పిల్లల తల్లులకు రూ. 15 వేలు సాయం చేశారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పిల్లలకు మంచి పోషకాలు ఉన్న ఆహారం అందిస్తున్నారు. అలాగే వారి భవిష్యత్ కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నారు.

 

అదేవిధంగా వారికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారు. కంటిచూపు టెస్టులు పెట్టారు. తాజాగా కూడా రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ వైఎస్సార్‌ చిరునవ్వు’ ద్వారా ఉచితంగా దంత వైద్యం చేయించి, వారికి టూత్‌పేస్ట్, బ్రష్‌ను ఉచితంగా ఇవ్వనున్నారు. జూన్‌ 1 నుంచి జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు రూ.1355 విలువ చేసే కిట్‌ అందించనున్నారు. కిట్‌ ద్వారా స్కూల్‌ బ్యాగు, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, మూడు జతల యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, యూనిఫాం కుట్టుకూలీ ఇవ్వనున్నారు. ఈ విధంగా జగన్ రాష్ట్రానికి భవిష్యత్ అందించే పిల్లల మీద ఉన్న ప్రేమని పథకాల రూపంలో అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: