కృష్ణా జిల్లా టీడీపీ అనగానే ఒకప్పుడు దేవినేని ఉమా పేరు ఎక్కువగా వినిపించేది. గత రెండు దశాబ్దాలుగా ఆయనే జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. వరుసగా గెలవడం వల్ల కావొచ్చు ఆయనకు జిల్లాలో ఎదురులేకుండా పోయింది. అటు అధినేత చంద్రబాబు కూడా ఉమాకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చేవారు. దీంతో ఉమా ఆధిపత్య పోరు తారస్థాయిలో ఉండేది. ఈయన ఆధిపత్య పోరు వల్ల చాలామంది టీడీపీ నేతలు ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.

 

ఈయన వల్లే కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు టీడీపీని వదిలేసి వెళ్ళిపోయారు. అయితే 2019 ఎన్నికలు తర్వాత మాత్రం ఉమాకు జిల్లాలో అనుకూల పరిస్థితులు లేకుండా పోయాయి. వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచి హడావిడి చేసిన ఉమా, 2019 ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈయన మాట లెక్క చేసే నాయకుడే లేకుండా పోయాడు.

 

ముఖ్యంగా ఈయన మీద ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న గద్దె రామ్మోహన్, కేశినేని నానిలు, ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు. పైగా ఇద్దరు గెలవడంతో, ఉమాని విజయవాడపై పెత్తనం చేయనివ్వడం లేదు. అసలు 2019 ఎన్నికలు అవగానే నాని, దేవినేని లక్ష్యంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కొడాలి నాని మంత్రి అవ్వడానికి కారణమంటూ చురకలు అంటించారు.

 

ఇటు టీడీపీలో ఉండగా దేవినేని అవినాష్‌కు వచ్చే ఎన్నికల నాటికైనా తూర్పు సీటుని ఇప్పించాలని ఉమా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అధినేత ద్వారా లాబీయింగ్ చేసి గద్దెకు చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేశారు. అయితే అధినేత గద్దె మీద విశ్వాసం ఉంచడంతో, ఉమా పప్పులు ఉడకలేదు. దీంతో అవినాష్ లాభం లేదనుకుని వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఈ  విధంగా కేశినేని-గద్దెలు ఉమాకు చెక్ పెట్టేశారు. అటు ఉమా కూడా విజయవాడ వైపు పెద్దగా రావడం లేదు. ఏదైనా ఉంటే మైలవరంలోనే హడావిడి చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు నిరసనల పేరుతో హైవే ఎక్కేస్తున్నారు. మొత్తానికైతే కృష్ణాలో ఉమా పెత్తనం తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: