తొమ్మిది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైసిపిలో కూడా ప్రజాస్వామ్యం బాగా పెరిగిపోతున్నట్లే ఉంది. మామూలుగా ఈ తరహా ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో చూసేవాళ్ళం. అటువంటి ప్రజాస్వామ్యమే ఇపుడు వైసిపిలో కూడా చూడగలుగుతున్నాం. ఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు జిల్లాలోని నందికొట్కూరు ఎంఎల్ఏ ఆర్ధర్ దగ్గర చేదు అనుభవం ఎదురవ్వటమే ఇపుడు సంచలనంగా మారింది.

 

ప్రస్తుత విషయానికి వస్తే నందికొట్కూరు నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటి ఛైర్మన్, పాలకవర్గం భర్తీ సమస్యగా మారింది. మామూలుగా ఏ నియోజకవర్గంలో అయినా అక్కడ ఎంఎల్ఏ చెప్పిన వాళ్ళనే  కమిటిలో నియమిస్తారు. కానీ ఈ ఎస్సీ నియోజకవర్గంలో మాత్రం ఎంఎల్ఏ ప్రతిపాదనలకు ప్యారలల్ గా  మరో నేత సిద్ధార్ధ రెడ్డి కూడా ఓ లిస్ట్ ఇచ్చాడు. దాంతో  సమస్య మొదలైంది. ఇద్దరి జాబితాల మధ్య గొడవతో చివరకు పాలకవర్గం  ఏర్పాటు కూడా ఆగిపోయింది.

 

ఈ విషయంపై రెండు వర్గాలు కొంత కాలంగా గొడవలు పడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే మంత్రి జిల్లాకు వచ్చారు. దాంతో కమిటి పంచాయితి మంత్రి ముందుకొచ్చింది. మంత్రి దగ్గరకు ఎందుకు వచ్చిందంటే సిద్దార్ధరెడ్డికి మంత్రి మద్దతు ఇస్తున్నాడనే అనుమానం ఎంఎల్ఏతో పాటు ఆయన మద్దతుదారుల్లో బలంగా ఉంది. దాంతో పంచాయితిని మంత్రి ముందు ఓపెన్ చేయగానే గొడవ మొదలైంది.

 

దాంతో ఎంఎల్ఏతో పాటు మద్దతుదారులు మంత్రిపై రెచ్చిపోయారు. తమను కాదంటే అసలు జిల్లాలోనే తిరగనీయకుండా చేస్తామంటు చేసిన హెచ్చరికలు సంలనంగా మారింది. ఎంఎల్ఏ ఇచ్చిన జాబితాకు పోటిగా మరో నేత ఇంకో జాబితా ఇస్తే ప్రభుత్వం దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటుందంటూ ఎంఎల్ఏ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. నిజానికి రెడ్డికి మంత్రి మద్దతుందా లేదా అన్నది తేలలేదు. కానీ ఎంఎల్ఏతో పాటు అనుచరులు మాత్రం తీవ్ర హెచ్చరికలు చేసేశారు. ఒక్క కమిటి విషయంలోనే కాదు ప్రతి విషయంలో ఇద్దరికీ ఏమాత్రం పడటం లేదు. చివరకు వీళ్ళ గొడవ ఎక్కడదాకా వెళుతుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: