బోయినపల్లి వినోద్‌కుమార్....తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌న్నిహితుడు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎంపీగా ఓట‌మి పాల‌యిన‌ప్ప‌టికీ...కేబినెట్ హోదా క‌లిగిన‌ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా కేసీఆర్ ఆయ‌న్ను నియ‌మించారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌టి ముఖ్య‌మైన స్థానంలో ఉన్న వ్య‌క్తి, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌కు ఆప్తుడు తాజాగా ఆస‌క్తిక‌రమైన కామెంట్లు చేశారు. స‌రిహ‌ద్దుల్లో ఉన్న క‌శ్మీర్‌కు, దేశంలో కీల‌క‌మైన ప్రాంతంలో ఉన్న తెలంగాణ‌కు ముడిపెట్టారు. క‌శ్మీర్‌కు ఓ న్యాయం తెలంగాణ‌కు మ‌రో న్యాయ‌మా అని ప్ర‌శ్నించారు. 

 

తమకు అనుకూలంగా లేని రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదంటూ వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలను 107 నుంచి 114కు పెంచారని తెలిపారు. కశ్మీర్‌కు ఏడు అసెంబ్లీ స్థానాలను పెంచిన కేంద్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎందుకు పెంచడంలేదని ఆయ‌న నిలదీశారు. ఒకే దేశం - ఒకే చట్టం అన్న నినాదం ఏమైందని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ సీట్లను పెంచుతామని అంటున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కశ్మీర్‌లో ఎందుకు పెంచారని ప్ర‌శ్నించారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని ఆరేళ్లుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయంగా ఎటువంటి లాభం లేనందునే దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు.  అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఏపీ, తెలంగాణ ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని వినోద్‌కుమార్‌ తెలిపారు. 

 

 

రాత్రికి రాత్రి ఏపీ విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని పొందుపర్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసి వ్యాఖ్యలను వినోద్‌కుమార్‌ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ మంత్రులు, బీజేపీ అగ్రనేతలు అద్వాని, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ వంటి నేతలు కొన్ని నెలల పాటు చర్చించి అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారని ఆయన గుర్తుచేశారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ అగ్రనేతలను కించపర్చేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: