ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబునాయుడిని విశాఖ విమానాశ్రయం వద్ద అడ్డుకోవడం, శాంతిభ‌ద్ర‌త‌ల కోణంలో అదుపులోకి తీసుకోవ‌డంపై విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, ఈ ఎపిసోడ్‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అత్యంత ఆస‌క్తిక‌రంగా ఆ పార్టీ నేత‌లు టీడీపీ వైపున నిలిచారు. రాష్ట్రంలోని నేత‌లే కాకుండా దేశంలోని వారు సైతం ఏపీ స‌ర్కారును త‌ప్పుప‌డుతున్నారు. విశాఖ దాడి ఏమాత్రం సమర్థనీయం కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజకీయాల్లో విలువలుండాలని,  విశాఖపట్నంలో చంద్రబాబును అడ్డుకోవడం తప్పేనని అన్నారు. 

 

కాగా, బీజేపీ సీనియ‌ర్‌ నాయకుడు విష్ణుకుమార్‌ రాజు స్పందిస్తూ  టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబునాయుడిని అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పారు. పోలీసుల అనుమతితోనే చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుపై గుడ్లు, చెప్పులు విసరడం సరైన విధానం కాదని ఆయన అన్నారు. విశాఖ విమానాశ్రయం వద్ద  చంద్రబాబును  అడ్డుకోవడానికి రాజకీయ నేతల ప్రోద్బలమే కారణమని  అన్నారు. చంద్రబాబును ప్రజలు అడ్డుకోలేదని ఆయన అన్నారు. కేవలం రాజకీయ నేతల ప్రోద్బలంతోనే చంద్రబాబును అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఫ్యాక్షనిజాన్ని తెచ్చే పద్ధతిని ప్రోత్సహించవద్దని ఆయన హితవు చెప్పారు.

 

మ‌రోవైపు ఏపీ పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విశాఖ ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడారని మండిప‌డ్డారు. సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ కుప్పానికి తాగునీరు ఇవ్వలేని చంద్రబాబు.. తమపై నిందలు వేయడం సరికాదని  మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు చంద్రబాబు విశాఖ వచ్చారన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం చూస్తుంటే..చంద్రబాబు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే.. టీడీపీ నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసలు ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: