కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ధ్య ఎలాంటి మాట‌ల యుద్ధం జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సీఏఏ, ఎన్నార్సీ విష‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌లు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. అలాంటి తాజాగా అమిత్‌షాకు అనూహ్య రీతిలో బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అండ‌గా నిలిచారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి షాకిస్తూ...షాకు అండ‌గా నిలిచారు.

 


ఢిల్లీ అల్లర్ల నేప‌థ్యంలో  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సార‌థ్యంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అల్ల‌ర్ల‌పై చర్చించి, తీర్మానం చేశారు. అనంతరం సోనియా మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య ఢిల్లీలో హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఢిల్లీ ఎన్నికలప్పుడు బీజేపీ నేతలు తమ ప్రసంగాలతో ప్రజల మధ్య విద్వేషం, భయానక వాతావరణాన్ని సృష్టించారు. బీజేపీ నేత కపిల్‌ మిశ్రా పోలీసులకు మూడు రోజులు గడువు ఇస్తున్నానంటూ రెచ్చగొ ట్టారు. అయినా ప్రభుత్వాలు మిన్నకుండిపోవడంతో 72 గంటల్లో 20 మందికిపైగా మరణించారు’ అని విమర్శించారు. ఆదివారం నుంచి అమిత్‌ షా ఎక్కడున్నారు? ఆయ‌న వెంట‌నే రాజీనామా చేయాలి అని కోరారు.

 

అయితే, తాజాగా భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రిగిన ఈస్ట్ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జ‌రిగిన‌ ఆ స‌మావేశానికి.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పాటు మ‌రో కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ పాల్గొన్నారు. సీఎం ప‌ట్నాయ‌క్ త‌న నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్‌లో ఈ నేత‌లంతా అంద‌రూ క‌లిసి భోజ‌నం చేశారు. ఆ త‌ర్వాత సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర్ల ప‌ట్ల మ‌మ‌తా స్పందించారు.  ఆ ఘ‌ట‌న‌లు క‌లిచివేశాయ‌న్నారు.  అలా జ‌రిగి ఉండాల్సి కాద‌న్నారు.  పోలీసు అధికారితో పాటు ఓ ఐబీ ఆఫీస‌ర్ కూడా ప్రాణాలు కోల్పోయార‌న్నారు.  బాధిత కుటుంబాల‌కు సాయం చేయాల‌న్నారు. అమిత్ షా రాజీనామా చేయాల‌న్న ప్ర‌తిప‌క్షాల డిమాండ్ స‌రైంది కాదు అని,  ప్ర‌స్తుతం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు.  రాజ‌కీయ చ‌ర్చ‌లు త‌ర్వాత చేప‌ట్టాల‌ని బెన‌ర్జీ అన్నారు.   ఈశాన్య ఢిల్లీలో హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేయ‌డం...దానికి భిన్నంగా మ‌మ‌త స్పందించ‌డం స‌హ‌జంగానే ఆస‌క్తిక‌రంగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: