చిరుద్యోగుల‌కు, వేతనజీవులకు చేదువార్త. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న బ‌డ్జెట్‌లో ప‌న్ను మిన‌హాయింపులు ఇవ్వ‌క‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఇంకో కీల‌క నిర్ణ‌యానికి సిద్ధ‌మైంది. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లను త‌గ్గించేందుకు సిద్ధ‌మైంది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి (15 బేసిస్‌ పాయింట్లు) తగ్గించాలని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భావిస్తున్నట్టు సమాచారం. ఈపీఎఫ్‌వోలో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు వేత‌న జీవుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి. 

 

మార్కెట్లలో ఈపీఎఫ్‌వో మొత్తంగా రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. వీటిలో 85 శాతం నిధులను డెట్‌ మార్కెట్లలో, మరో 15 శాతం నిధులను ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టింది. ఇబ్బందులతో సతమతమవుతున్న రెండు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో) ఈపీఎఫ్‌వో రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల దివాలా ప్రక్రియ కొనసాగుతుండటంతో వాటి నుంచి ఇప్పటికిప్పుడు ఈపీఎఫ్‌వో సొమ్ము రికవరీ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. 

 

దీంతో పాటుగా పెట్టుబడులపై లాభాలు తగ్గడం, దీర్ఘకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలపై లాభాలు గత ఏడాది కాలంగా 50 నుంచి 80 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గడంతో ఈపీఎఫ్‌వో ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించకపోవచ్చున‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. పీఎఫ్‌ వడ్డీరేటు కుదింపుపై తుదినిర్ణయానికి రావడానికి ముందు గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌వోకు వచ్చిన రాబడులపై ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ (ఎఫ్‌ఐఏసీ) పరిశీలన జరుపుతుంది. ఆ తర్వాత ఈపీఎఫ్‌వోలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) పీఎఫ్‌ వడ్డీరేటు కుదింపుపై చర్చిస్తుంది. అనంత‌రం నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: