వైసిపిలో అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పార్టీలో పెయిడ్ ఆర్టిస్టులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ పార్టీ అధికార ప్రతినిధి, ఎంఎల్సీ మొహ్మద్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. మీడియాతో ఇక్బాల్ తాజాగా మాట్లాడుతూ పెయిడ్ ఆర్టిస్టులను వెంటనే సస్పెండ్ చేయకపోతే పార్టీకి తీరని నష్టం తప్పదని కూడా హెచ్చరించటం కలకలం రేపుతోంది.

 

పెయిడ్ ఆర్టిస్టులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయటంలో తప్పేమీ లేదు. కానీ హఠాత్తుగా ఇప్పటికిప్పుడే పెయిడ్ ఆర్టిస్టులపై ఇక్బాల్ ఎందుకు డిమాండ్లు మొదలు పెట్టారన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇక్బాల్ వాదన ఏమిటంటే పార్టీలో కొందరు పెయిడ్ ఆర్టిస్టులు వైసిపి గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిలా రెడ్డిని వ్యక్తిగతంగా ధూషించిన వారు కూడా ప్రముఖులుగా చెలామణి అవుతున్నారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

 

పెయిడ్ ఆర్టిస్టుల గురించి ఇంత చెప్పిన ఇక్బాల్ మళ్ళీ వాళ్ళెవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఈ ఎంఎల్సీ చెబుతున్నదే నిజమైతే విజయమ్మ, షర్మిలనే కాదు జగన్ ను వ్యక్తిగతంగా దూషించిన వారు కూడా చాలామందే ఉన్నారు ఇపుడు వైసిపిలో.  సస్పెండ్ చేసుకుంటే పోతే చాలామంది ప్రముఖ నేతలనే పార్టీ నుండి బయటకు పంపేయాలి. ప్రస్తుతం మంత్రిగా ఉన్న బొత్సా సత్యానారాయణ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నపుడు జగన్ గురించి, విజయమ్మ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే.

 

అదే విధంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎంఎల్ఏగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి కూడా జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడిన వాడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామందే దొరుకుతారు. మరి వాళ్ళని స్వయంగా జగనే పిలిచి పార్టీ కండువా ఎందుకు కప్పినట్లు ? తర్వాత మంత్రి, ఎంఎల్ఏని ఎందుకు చేసినట్లు ? ఎందుకంటే అవసరాలు అనేకం ఉంటాయి. ఎప్పుడో తిట్టారని జీవితాంతం వాళ్ళని దూరంగా పెట్టాలంటే రాజకీయాల్లో  కుదరదు. కాబట్టి ఇక్బాల్ డిమాండ్ చేయటంలో తప్పులేదు కానీ సాధ్యాసాధ్యాల విషయాన్ని కూడా చూసుకోవాలి కదా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: