దేశంలో కొన్ని టెలికాం కంపెనీలు దివాళా దిశగా పయనిస్తూ ఉండటంతో వొడాఫోన్ ఐడియా టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది. ఈ లేఖలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి డేటా, ఔట్ గోయింగ్ కాల్స్ కు కనీస చార్జీలు నిర్ణయించాలని లేకపోతే తమ మనుగడ కష్టమని స్పష్టం చేసింది. కాల్ చార్జీలను 8 రెట్లు, డేటా చార్జీలను కనీసం 7 రెట్లు పెంచాలని లేఖ ద్వారా కేంద్రాన్ని వొడాఫోన్ ఐడియా కోరింది. 
 
వొడాఫోన్ ఐడియా రాసిన ఈ లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే వొడాఫోన్ ఐడియాతో పాటు జియో, ఎయిర్ టెల్ ఔట్ గోయింగ్ కాల్స్, డేటా చార్జీలు భారీగా పెరగనున్నాయి. మరోవైపు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు ఇవే డిమాండ్లతో డాట్ కు లేఖ రాసింది. వొడాఫోన్ ఐడియా ఒక జీబీ డేటా 35 రూపాయలు, నిమిషానికి ఔట్ గోయింగ్ కాల్ చార్జీలు 6 పైసలుగా నిర్ణయించాలని కోరింది. 
 
నెలవారీ కనీస కనెక్షన్ చార్జీలను 50 రూపాయలకు పెంచాలని ప్రతిపాదనలు చేసింది. భారీ నష్టాలతో పాటు ఏజీఆర్ బకాయిల వివాదం నేపథ్యంలో సంస్థ మనుగడ కోసం వొడాఫోన్ ఐడియా ఈ ప్రతిపాదనలు చేసింది. ప్రతిపాదిత రేట్లను ఏప్రిల్ 1నుండి అమలు చేయాలని వొడాఫోన్ ఐడియా కోరుతోంది. టెలికాం పరిశ్రమను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి శుక్రవారం రోజున అధికారులు సమావేశం కానున్నారని తెలుస్తోంది. 
 
వొడాఫోన్ ఐడియా కాల్ చార్జీలు, డేటా చార్జీలు పెంచితే తప్ప ఏజీఆర్ బకాయిలు చెల్లించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలకు సంబంధించి 53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కంపెనీ ప్రభుత్వానికి ఇప్పటికే 3500 కోట్ల రూపాయలు చెల్లించగా బకాయిలను చెల్లించటానికి 18 సంవత్సరాల సమయం కోరినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. వొడాఫోన్ ఐడియా ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రేట్లు పెంచితే మాత్రం వినియోగదారులు నెలకు 1000 రూపాయల వరకు ఔట్ గోయింగ్ కాల్స్, డేటా కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: