ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మరో 23 రోజుల్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ పదో తరగతి పరీక్షల్లో ఇచ్చే ఓఎమ్మార్ షీటులో విద్యార్థి ఫోటోను ముద్రిస్తోంది. ఓఎమ్మార్ షీటుపై విద్యార్థుల హాల్ టికెట్ నంబర్ తో పాటు బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ లో పరీక్ష రాసే విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. 
 
విద్యాశాఖ పరీక్షలకు ఒకరి బదులు మరొకరు హాజరు కావడానికి అవకాశం లేకుండా ఉండేందుకు ఈ విధానం తీసుకొచ్చామని చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల కోసం 2900 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పదవ తరగతి విద్యార్థుల హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించనున్నారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,30,000 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మార్చి 23వ తేదీ నుండి ఏప్రిల్ 8 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యాశాఖ ప్రశ్నపత్రం, గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, ఇన్విజిలేటర్ల నియామకం, జవాబు పత్రం... ఇలా అన్నింటిలో కీలక మార్పులు చేసింది. ఇకనుండి విద్యాశాఖ విద్యార్థులకు పేపర్ల వారీగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్లను ఇవ్వనుంది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులను ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 
 
పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు తొలగించడం, బిట్ పేపర్ ను తొలగించడం, హిందీ మినహా ఒక్కో పేపర్ లో 50 మార్కులకు 33 ప్రశ్నలు, జవాబులు రాయడానికి 24 పేజీల బుక్ లెట్ ఇచ్చేలా విద్యాశాఖ మార్పులు చేసింది. ఇన్విలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయించటంతో పాటు పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.        

మరింత సమాచారం తెలుసుకోండి: