ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఇంటర్ కాలేజీల యాజమాన్యానికి ఊహించని షాక్ ఇచ్చింది. విద్యార్థులు కాలేజీలతో సంబంధం లేకుండా ఆన్ లైన్ నుండి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. హాల్ టికెట్ లో కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం ఉండాలన్న నిబంధనను తొలగించింది. ప్రభుత్వం సూచనలతో ఇంటర్ బోర్డు వెబ్ సైట్ నుండి విద్యార్థులు హాల్ టికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫీజులతో హాల్ టికెట్లకు ముడిపెట్టి పరీక్షల ముందు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తాయనే విషయం తెలిసిందే. ఫీజు కడితేనే ప్రిన్సిపాల్ సంతకం హాల్ టికెట్ పై ఉంటుందని యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడేవి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల మొండి వైఖరికి చెక్ పడినట్టయింది. ఇంటర్మీడియట్ బోర్డ్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
 
bie.ap.gov.in వెబ్ సైట్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పదవ తరగతి హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అధికారులు 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. 60 నుండి 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులు అపరాధ రుసుమును బ్యాంకులో చెల్లించి ఆ రశీదును ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో సమర్పించి హాల్ టికెట్ పొందవచ్చు. 
 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వం ఫీజులకు, హాల్ టికెట్లకు ముడిపెట్టే సాంప్రాదాయానికి తెరదించింది. ఈ సంవత్సరం నుండి ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కళాశాలలకు ఫీజు ఎంత చెల్లించాల్సి ఉన్నా విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఎటువంటి సమస్యలు ఉండవు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: