2019 ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. 30 వేలకు పైనే మెజారిటీ తెచ్చుకున్నవారు ఎక్కువగానే ఉన్నారు. అలా భారీ మెజారిటీ తెచ్చుకున్న ఎమ్మెల్యేలలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఒకరు. ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మద్దిశెట్టి, 2009లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఓడిపోయాక ఆయన రాజకీయాల్లో కనిపించలేదు. సొంత బిజినెస్ పనులు చేసుకుంటూ బిజీ అయిపోయిన మద్దిశెట్టి...మళ్ళీ 2019 ఎన్నికల ముందు కనిపించారు.

 

దర్శిలో బలమైన కేడర్ గల బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఆర్ధిక పరిస్థితుల వల్ల పోటీ చేయలేనని చేతులెత్తేయడంతో మద్దిశెట్టి వైసీపీలో చేరిపోయి టికెట్ తెచ్చేసుకున్నారు. ఇక అనూహ్యంగా వైసీపీ తరుపున పోటీ చేసిన మద్దిశెట్టికి బూచెపల్లి వర్గం సపోర్ట్ ఇవ్వడం, అటు టీడీపీ తరుపున శిద్ధా రాఘవరావు కాకుండా కదిరి బాబూరావు పోటీ చేయడంతో భారీ మెజారిటీతో గెలిచేశారు. దాదాపు 39 వేలపైనే మెజారిటీతో మద్దిశెట్టి విజయం సాధించారు.

 

ఇక భారీ మెజారిటీ ఇచ్చిన ఊపుతో మద్దిశెట్టి నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటూ, వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. అలాగే అభివృద్ధిలో భాగంగా సి‌సి రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అటు ఈయన నియోజకవర్గంలో ఉన్న దొనకొండలో సోలార్ ప్లాంట్, డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.

 

అయితే స్థానికంగా బూచెపల్లి వర్గంతో కలిసి ముందుకెళుతున్న మద్దిశెట్టి, తమకు అనుకూలంగా ఉన్నవారికి కొన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ వర్గాలలో అర్హులు ఉంటే వారికి ప్రభుత్వ పథకాలు అందడం గగనం అయిపోయాని తెలుస్తోంది. అలాగే కాంట్రాక్టులు కూడా తమ అనుకూల వర్గాలకి ఇచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడంతో మద్దిశెట్టికి తిరుగులేకుండా పోయింది. మొత్తానికైతే మద్దిశెట్టి ప్రజలకు మేలు చేసే విషయంలో బాగానే పని చేస్తున్న, సొంతవారికి మేలు చేసే విషయంలో దూకుడుగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: