శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అనగానే మొదట గుర్తొచ్చేది దివంగత ఎర్రన్నాయుడు ఫ్యామిలీ. ఒకప్పుడు ఎర్రన్నాయుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పితే, ఇప్పుడు ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్ నాయుడులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. టీడీపీలో వీరు పెద్ద దిక్కుగా ఉంటే, వైసీపీలో ధర్మాన బ్రదర్స్ పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో వారే జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉంటే, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

 

ఈ విధంగా ఇటు టీడీపీలో బాబాయి-అబ్బాయిలు, అటు వైసీపీలో ధర్మాన బ్రదర్స్ శ్రీకాకుళం జిల్లాలో పెత్తనం చేస్తున్నారు. అయితే వీరిలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఉన్న క్రేజ్, ధర్మాన బ్రదర్స్‌కు లేదనే చెప్పాలి. ఎందుకంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు రాష్ట్ర స్థాయిలో పేరుంది. వారంటే తెలియని వారు లేరు. వారు పనితీరు, మాటతీరులో అదరగొట్టేస్తారు.

 

ఏ విషయంలోనైనా బాబాయ్-అబ్బాయ్‌లు దూకుడుగా ఉంటారు. పైగా వారి చుట్టు ఎలాంటి వివాదాలు కూడా లేవు. ఇక అంతటి జగన్ గాలిలో కూడా ఇద్దరూ విజయం సాధించారు. రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీగా గెలిచి, పార్లమెంట్‌లో అదరగొడుతుంటే, అచ్చెన్న టెక్కలి నుంచి గెలిచి అసెంబ్లీలో అధికార వైసీపీని అడ్డుకుంటున్నారు. అలాగే ఈ ఇద్దరు నేతలు చంద్రబాబుతో ఎంత సన్నిహితంగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా బాబు ఎలాంటి పోరాటానికి పిలుపునిచ్చిన ఇద్దరు నేతలు ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ విధంగా ఉండటం వల్లే ఈ బాబాయ్-అబ్బాయ్‌లకు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉంది.

 

అయితే ధర్మాన బ్రదర్స్‌లో ప్రసాదరావు అంతకముందు కాంగ్రెస్‌లో మంత్రిగా పని చేయడం వల్ల కాస్త ఆయన అందరికీ సుపరిచితులుగా ఉన్నారు. పైగా ఆయన మాటకారి కూడా. ఇప్పుడు మంత్రి పదవి లేకపోయినా..ప్రతిపక్ష టీడీపీకి చుక్కలు చూపించగలరు. కాకపోతే ధర్మాన మీద కేసులు ఉన్నాయి. ఇక మంత్రిగా ఉన్న కృష్ణదాస్ మృదు స్వభావి, మంత్రి కాకముందు ఈయన గురించి రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలియదు. పైగా జిల్లాలో ఈయన మాట సొంత నేతలే లెక్క చేయరనే ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా టీడీపీలో ఉన్న బాబాయ్-అబ్బాయ్‌ల కంటే వైసీపీలో ఉన్న ధర్మాన బ్రదర్స్‌కు కాస్త ఫాలోయింగ్ తక్కువనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: