టీడీపీ అధినేత చంద్రబాబు..తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ ద్వారా మొదలైన సంగతి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అలాగే ఆయనకు దివగత వైఎస్సార్ సహచరుడు అనే విషయం తెలుసు. అలాగే ఈయనకు కరణం బలరాం, కేఈ కృష్ణమూర్తిలు కూడా సహచరులే. వీరంతా కాంగ్రెస్ ద్వారా 1978లో ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే తర్వాత చంద్రబాబు, ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలోకి వచ్చేశారు. ఆయనతో పాటు కరణం, కేఈలు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు.

 

ఇక చంద్రబాబు వచ్చాక టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. అలా అప్పుడు మొదలైన వారి రాజకీయ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బాబు టీడీపీ అధినేతగా ఉంటూ రాజకీయాలు చేస్తుంటే, కరణం ప్రకాశం జిల్లా టీడీపీకి, కేఈ కర్నూలు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కులుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి బాబుకు సపోర్ట్ ఇస్తున్న కరణం, కేఈలు 2019 ఎన్నికల తర్వాత పెద్దగా సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపించడం లేదు.

 

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు తెగ పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. అయితే బాబు పోరాటాలకు మిగిలిన వారి దగ్గర నుంచి మద్ధతు వచ్చిన, ఈ ఇద్దరు సీనియర్ల దగ్గర నుంచి పెద్దగా రావడం లేదు. కరణం ఎమ్మెల్యేగా ఉన్న అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు తప్ప, బాబు చేసే పోరాటాల్లో హైలైట్ అయిన సందర్భాలు ఎక్కువ లేవు.

 

అటు కేఈ అయితే ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నాక అసలు కనపడటం లేదు. ఏదో రెండు మూడుసార్లు మీడియా ముందుకొచ్చి మాట్లాడటం తప్ప. పైగా ఆ మధ్య వీరు పార్టీ మారే అవకాశం కూడా ఉందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా విశాఖలో బాబుపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఈ ఇద్దరు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తమ సహచరుడు, అందులో పార్టీ అధినేత అయిన బాబుకు అంత అవమానం జరిగితే వీరు ఖండించలేదు. ఏదేమైనా బాబు సహచరుల్లో భారీ మార్పే వచ్చినట్లు కనిపిస్తుంది. మరి ఈ మార్పు బాబుకు షాక్ ఇచ్చేలా అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: