కన్హయ్య కుమార్ దేశద్రోహం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. పూర్తిస్థాయి విచారణకు ఢిల్లీ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పోలీసులు విచారణకు సిద్ధమైయ్యారు. అయితే.. రాజకీయ ప్రయోజనాల కోసమే పాత కేసులను తిరగదోడుతున్నారని ఆరోపించాడు కన్హయ్య. 

 

జేఎన్‌యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్‌కు ఢిల్లీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తనపై దాఖలైన దేశద్రోహం కేసు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. గతేడాది జనవరిలో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలని  ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. అనుమతి రాకపోవడంతో సుప్రీంను ఆశ్రయించారు.  ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక... కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కేజ్రీవాల్‌దే అంతిమ నిర్ణయమని బీజేపీ తేల్చి చెప్పింది. దీంతో విచారణకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్‌.

 

అయితే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతుండగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని, ప్రస్తుతం బీహార్ ఎన్నికలకు ముందు విచారణకు ఆదేశించారని ఆరోపిస్తున్నాడు కన్హయ్య.  రాజకీయ ప్రయోజనాలకోసమే ఇన్నిరోజులు కేసును తొక్కిపెట్టారన్నది అతడి మాట. . విచారణను త్వరగా పూర్తి చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు. అయితే దేశద్రోహం కేసులు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో...దేశానికి చెప్పాలనుకుంటున్నానంటున్నాడు. 

 

2016లో కన్హయ్య జేఎన్‌యూ విద్యార్థి నేతగా ఉన్నాడు. ఆ సమయంలోనే పార్లమెంట్‌పై దాడి కేసు సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతి నిర్వహించారని, భారత్ తుక్‌డా హోగా అంటూ నినాదాలు చేశారన్నది అతడిపై ప్రధాన ఆరోపణ. దీంతో కన్హయ్య, ఉమర్ ఖాలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్య సహా పలువురు విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదైంది. 

 

కన్హయ్య జేెఎన్ యూలో విద్యార్థిగా ఉన్నప్పుడు.. చదువులోనేకాదు ఓ విద్యార్థి నాయకుడిగా ఓ వెలుగువెలిగాడు. పలు సమస్యలపై పోరాడి యావత్ దేశ ప్రజల నోళ్లలో మెదిలాడు. ఇపుడు ఆయనపై ఉన్న దేశద్రోహం కేసు ఎంతవరకు దారితీస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: