రాజకీయ వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఢిల్లీ రాజకీయాల్లో ఈ నెలలో జరిగే ఎన్నికల్లో ఆయన రాజ్యసభకు ఎన్నికవుతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. 
 
ఎన్నికల సంఘం కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటన చేసింది. వీరిలో టీఎంసీకి చెందిన నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనుండగా అసెంబ్లీలో బలం ఆధారంగా నాలుగు స్థానాలు పార్టీ కైవసం చేసుకోనుంది. పీకే బెంగాల్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ తరపున పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన నాయకులను రాజ్యసభకు పంపాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే పీకేను నామినేట్ చేయాలని మమతా బెనర్జీ భావిస్తోంది. కేంద్రం తెచ్చిన సీఏఏను తీవ్రంగా వ్యతిరేకించటంతో పీకే జేడీయూ నుండి బహిష్కరణకు గురయ్యారు. ఢిల్లీలో కేజ్రీవాల్ తో జత కట్టి పీకే బీజేపీని ఓడించారు. బెంగాల్ లో మమతా బెనర్జీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా బెంగాల్ లో లాబీయింగ్ చేస్తున్నారు. 
 
మమతా బెనర్జీ రాజ్యసభకు బీజేపీ వ్యతిరేకులను పంపాలని యోచిస్తోంది. పీకే ద్వారా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ను నడిపించాలని మమతా బెనర్జీ భావిస్తున్నారని సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పీకే వ్యూహం ఏమిటనేది అర్థం కావటం లేదు. మోదీని గట్టిగా నిలదీసే తెగువ పీకేలో ఉందని ఆయనను రాజ్యసభకు పంపి తద్వారా సాయం తీసుకోవాలని మమతా బెనర్జీ ప్రణాళిక రచించినట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పీకేకు జడ్ కేటగిరీ భద్రతను కల్పించనుందని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: