పేర్ని వెంకట్రామయ్య(నాని)...వైసీపీ సీనియర్ నేత, మచిలీపట్నం ఎమ్మెల్యే, ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి. అయితే వీటి అన్నిటికంటే ముందు ఆయన బందరు ‘సామాన్యుడు’. తండ్రి కృష్ణమూర్తి ఒకప్పుడు రాజకీయాల్లో దిగ్గజ నాయకుడైన, నాని మాత్రం సామాన్యుడుగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏ మాత్రం హడావిడి చేయకుండా కాంగ్రెస్‌ పార్టీలో ఎదుగుతూ వచ్చి, 2004లో మచిలీపట్నం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నాని ఎన్నికల ప్రచారం ఒక రిక్షాలో చేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

ఇక ఏదో ఎమ్మెల్యే అయిపోయాం అని చెప్పి ప్రజలకు అందనంత స్థాయిలో లేకుండా లేరు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ కష్టపడ్డారు. బందరు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన అండగా నిలబడ్డారు. అలా నిలబడటం వల్లే 2009లో నాని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. అయితే ఊహించని విధంగా వైఎస్సార్ మరణంతో, ఆయన తనయుడు జగన్‌కు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పదవి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చేశారు. తర్వాత రెండేళ్ళు ఎలాంటి పదవి లేకుండా ఉన్న నాని 2014లో పోటీ చేసి అనూహ్యంగా పరాజయం చెందారు.

 

అయితే ఓటమికి వెనక్కి తగ్గకుండా ఐదేళ్లు ప్రతిపక్షంలోనే కష్టపడ్డారు. ఇక ఆ కష్టానికి ప్రతిఫలంగా 2019లో గెలవడం, మంత్రి పదవి అందుకోవడం జరిగిపోయాయి. మామూలుగా మంత్రి అయితే జనాలకు అందుబాటులో ఉండటం కష్టం. కానీ నాని మాత్రం దానికి విరుద్ధం, మంత్రి అయ్యాకే జనాలకు మరింత అందుబాటులో ఉంటున్నారు. అసలు ఎప్పటిలాగానే బందరులో ఒక్కడే తిరిగేస్తూ ప్రజల దగ్గరకు వెళ్లిపోతున్నారు. ఒకోసారి అయితే ఒక స్కూటీ పట్టుకుని నియోజకవర్గంలో తిరిగేస్తారు. మంత్రి అనే హడావిడి లేకుండా ‘నేను ఎప్పుడు బందరు బిడ్డనే’ అనే విధంగా నడుచుకుంటున్నారు.   

 

ఈ 9 నెలల కాలంలో నియోజకవర్గంలో అనేక సమస్యలకు చెక్ పెట్టారు. కొత్తగా రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా బందరు ప్రజల చిరకాల కల బందరు పోర్టు నిర్మాణం విషయంలో పేర్ని నాని ముందుకెళుతున్నారు. అటు సీఎం కూడా పోర్టు నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇక నియోజకవర్గంలో నానికి ఉన్న మరో అడ్వాంటేజ్ ఆయన తనయుడు కృష్ణమూర్తి. నాని మంత్రిగా బిజీగా ఉండటంతో, నియోజకవర్గ ప్రజల సమస్యలని తెలుసుకుని పరిష్కరించడంలో ఆయన తనయుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇది సమస్య అని చెబితే చాలు వెంటనే పరిష్కారం అయ్యేలా చేస్తున్నారు.

 

అటు మంత్రివర్గంలో జగన్‌కు ఉన్న అత్యంత సన్నిహితుల్లో నాని ఒకరు. అందుకే జగన్ ప్రతిష్టని మరింత పెంచేలా నాని  పనిచేస్తున్నారు. మంత్రిగా బాగా రాణిస్తున్నారు. తొలిసారి మంత్రి అయిన, 9 నెలల్లోనే శాఖపై పట్టు తెచ్చుకున్నారు. రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ ఉద్యోగులని, ప్రభుత్వంలో విలీనం చేసి, వారికి అనేక బెన్‌ఫిట్స్ కలిగేలా చేశారు. అలాగే వారి పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. అటు ఆటోవాలాలు, ట్యాక్సీవాలాలకు పది వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇక రాష్ట్రంలో కొత్తగా బస్సులు తీసుకురావడం, బస్టాండ్‌ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. ఇటు అర్హులైన జర్నలిస్టులందరికీ ఉగాది నాటికల్లా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

 

ఇలా ఎమ్మెల్యే, మంత్రిగా రాణిస్తున్న నాని, అధికార వైసీపీ నేతగా అదరగొడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీకి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఏ మాత్రం అసభ్యంగా మాట్లాడకుండా, అదిరిపోయే టైమింగ్‌తో పంచ్‌లు వేస్తున్నారు. అటు జనసేనానికి కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసిన వాటిని తిప్పికొట్టడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మొత్తానికైతే జగన్‌ ప్రభుత్వంలో ఈ బందరు ‘సామాన్యుడు’ దూసుకెళుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: