హైదరాబాద్ నగరంలో శనివారం ఒకే రోజు రెండు గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పేలుడు ఘటనలతో పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుళ్లు జరగటంతో.. అది కూడా రాత్రి కావటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మలక్ పేటతో పాటు సరూర్ నగర్‌ లో శనివారం రాత్రి వంట గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడగా.. ప్రస్తుతం వారికి వేర్వేరు హాస్పిటళ్లలో చికిత్స అందిస్తున్నారు. 

 

 

మలక్ పేటలోని అస్మాన్ ఘడ్‌ లోని ఓ ఇంట్లో శనివారం అర్ధ రాత్రి గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్‌ కు తరలించారు. 

 

కాగా., ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో పాటు ఫ్రిడ్జ్ వెనుక భాగంలోని థర్మోస్టేట్ షాట్ సర్క్యూట్ కావడంతో పేలుడు జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. పేలుడు ధాటికి ఇంటి పై ఉన్న రేకులు విరిగిపోయాయి, సామాన్లన్నీ చెల్లాచెదురయ్యాయి. చుట్టు పక్కల ఇళ్లు, కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంట్లో వారు గాయపడటంతో పాటుగా కొంతమేర ఆస్థి నష్టం జరిగిందని తెలిపారు.

 

అయితే.. హైదరాబాద్ లోనే మరో పేలుడు సంఘటన సరూర్‌ నగర్ కోదండరాం నగర్‌ లో శనివారం రాత్రి ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఇంట్లో గ్యాస్ లీకవుతున్న విషయం ఆ ఇంటి యజమాని గమనించారు. దీంతో అప్రమత్తమైన ఆ ఇంటి యజమాని తమ  భార్యాపిల్లల్ని బయటకు పంపించాడు. తర్వాత ఇంట్లో ఏం జరిగిందో చూద్దామని తన తమ్ముడితో కలిసి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం ఇంట్లోకి వెళ్ళిన అతను లైట్ వేయడంతో పేలుడు సంభవించింది. దాంతో వారిద్దరికీ గాయలయ్యాయి. ప్రస్తుతం వారిద్దరూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలకు ఏటువంటి హాని జరగలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: