ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ప్రకటన చేసిన  రోజు నుండి అమరావతిలో రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో కొన్ని కుటుంబాలు అనుమానాస్పదంగా సంచరించటం స్థానికంగా కలకలం సృష్టించింది. కొన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన కుటుంబాలు ఉద్యమం జరుగుతున్న ప్రాంతాల్లో గుడారాలు వేసుకున్నాయి. 
 
స్థానికులు సమాచారం అందించటంతో పోలీసులు భారీ బలగాలతో చేరుకుని అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాలలోకి వెళితే తాడేపల్లిలోని ఖాళీ ప్రదేశంలో టెంట్లు వేసుకుని కార్లలో వచ్చిన పది కుటుంబాలు రెండు రోజుల నుండి నివాసం ఉంటున్నాయి. రెండు రోజులుగా వారు అక్కడే ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్టు సమాచారం అందించారు. 
 
సీఐ మల్లిఖార్జున రావు 50 మంది పోలీసులతో చేరుకుని టెంట్లను, కార్లను తనిఖీ చేశారు. సోదాలలో వారికి పుస్తకాలు, జ్యోతిష్య సామాగ్రి, బల్బులు, ఆయుర్వేద మందులు, ఇతర వస్తువులు లభించాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తాము సంచార బుడగ జంగాలమని వారు సమాధానం ఇచ్చారు. వారిలో కొందరు బల్బులు, ఆయుర్వేద మందులు అమ్మి జీవనం సాగిస్తామని తెలిపారు. 
 
తమకు మొక్కు ఉందని బెజవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కు తీర్చుకోవాలని అక్కడికి వచ్చామని పోలీసులకు చెప్పారు. అసలు విషయం తెలిసిన పోలీసులు ఊపిరి పీల్చుకుని వారి వివరాలను తీసుకున్నారు. అనంతరం రాజధాని ఉద్యమం జరుగుతున్న ప్రాంతంలో టెంట్లు వేసుకోరాదని సూచించి పోలీసులు అక్కడినుండి వెళ్లిపోయారు. వెంటనే వారు టెంట్లను తొలగించి కార్లలో అక్కడినుండి వెళ్లిపోయారు. అసలు విషయం తెలియటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: