ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకు చేర్చాలనే లక్ష్యంతో సీఎం జగన్ గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గ్రామ, వార్డ్ వాలంటీర్లు వారికి కేటాయించిన ఇళ్లకు పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు ఉదయం పొద్దు పొడవక ముందే ఫించన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. 
 
చాలా ప్రాంతాలలో ఉదయం 4 గంటలకే ఫించన్ నగదును వాలంటీర్లు లబ్ధిదారులకు అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులు వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి ఫించన్ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం గ్రామ, వార్డ వాలంటీర్లు ఫించన్ల పంపిణీలో ఆలసత్వం వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా పెన్షన్ల పంపిణీలో జాప్యం చేశారంటూ మంత్రి పేర్ని నాని ఇద్దరు గ్రామ వాలంటీర్లను విధుల్లోంచి తొలగించారు. 
 
ఈరోజు మంత్రి మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవ్వారుపేట టేక్యా ప్రాంతంలో పర్యటించారు. స్థానికులు మంత్రి దృష్టికి 10వ వార్డులో వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో ఆలసత్వం వహించినట్టు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి సదరు వాలంటీర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు చేరేలా వాలంటీర్లు కృషి చేయాలని సూచించారు. 
 
గత నెలలో కొందరికి ప్రభుత్వం ఫించన్లు తొలగించడం వలన ఫించన్లు అందలేదు. ప్రభుత్వం రీసర్వే అనంతరం అర్హులందరికీ ఈ నెలతో పాటు గత నెల పెన్షన్లు కూడా అందిస్తోంది. కొన్ని జిల్లాలలో మంత్రులు, కలెక్టర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని అల్లాపురంలో కలెక్టర్ ఇంతియాజ్ ఫించన్లు పంపిణీ చేశారు. గతంలో ఫించన్లు పొందాలంటే గంటల తరబడి లైన్ లో నిల్చుని ఇబ్బందులు పడిన వాళ్లు ... ఇప్పుడు ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పేర్ని నాని పరోక్షంగా గ్రామ, వార్డ్ వాలంటీర్లు విధుల నిర్వహణలో ఆలసత్వం వహిస్తే ఉద్యోగం ఊడినట్లే అని సంకేతాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: