బీఎస్‌-6 వెహికిల్స్‌ దూసుకొస్తున్నాయి. బీఎస్‌-4 వెహికిల్స్‌కు బ్రేకులు పడనున్నాయి. ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. బీఎస్‌-4 వెహికిల్‌ ఉండి.. రిజిస్ట్రేషన్‌ చేసుకోని వాళ్లంతా ఈ నెలాఖరులోపు చేసుకోవాల్సిందే. మరోవైపు స్టాక్‌ క్లియర్‌ చేసుకునేందుకు బీఎస్‌-4 వెహికిల్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి... షోరూమ్‌లు. 

 

వాహన కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా రూపొందిన బీఎస్‌-6 వెహికిల్స్‌ రోడ్డెక్కనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలు కంపెనీలు భారత్‌ స్టాండర్డ్‌-6 వెహికిల్స్‌ను ఉత్పత్తి చేశాయి. మార్చి 31 తర్వాత బీఎస్‌-3, బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపి వేయనున్నారు. ఇలాంటి వాహనాలు కొనుగోలు చేసి... ఇంకా రిజిస్ట్రేషన్ చేయించని వాళ్లు గడువులోగా చేయించుకోవాలని సూచించింది రవాణా శాఖ. 

 

వెహికిల్‌ డీలర్లు కూడా నిర్ణీత తేదీలోపు షోరూంలో ఉన్న బీఎస్‌-3, బీఎస్‌-4 మోడల్‌ వాహనాలను విక్రయించడంతో పాటు... వాటి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. బీఎస్‌-4 వాహనాలను కొనుగోలు చేసిన వాళ్లు... పలు కారణాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. ఫ్యాన్సీ నంబర్‌ కోసమని కొందరు... రెండో వాహనం ఉంటే ట్యాక్స్‌ ఎక్కువ పడుతుందని కొందరు.. వాహనం వేరే పేరు మీద బదిలీ కాలేదని మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా... తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో తిరుగుతున్నారు. 

 

నంబర్‌ వచ్చాక రిజిస్ట్రేషన్‌ చేసుకుంటామని కొందరు.. ట్యాక్స్‌ కట్టి చేయిస్తామని మరికొందరు... డీలర్ల నుంచి వెహికిల్స్‌ కొనుక్కుని తీసుకెళ్తున్నారు. వాళ్లంతా ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే. చేయించుకోకపోతే... ఆ తర్వాత ఛాన్స్‌ ఉండదు. వాహనం నుంచి వెలువడే వాయు ఉద్గారాలను బట్టి... దాని స్థాయిని నిర్ణయిస్తారు. 2005లో మార్కెట్‌లోకి వచ్చిన బీఎస్‌-3 వాహనాలు 2010 నాటికి బాగా విస్తరించాయి. 2017లో బీఎస్‌-4 వాహనాలు వచ్చాయి. పొల్యూషన్‌ తగ్గించడమే లక్ష్యంగా ప్రస్తుతం బీఎస్‌-6 వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. 

 

సరికొత్త ఫీచర్లు, భద్రతా ప్రమాణాలతో బీఎస్‌-6 వాహనాలు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పటికే కొన్ని షోరూముల్లో ఇప్పటికే బీఎస్‌-6 వాహనాల విక్రయాలు ప్రారంభమయ్యాయి. స్పీడ్‌, కెపాసిటీ పరంగా ఇవి మెరుగ్గా ఉండి.. కాలుష్యాన్ని తగ్గిస్తాయి. BS-4 వాహనాలతో పోలిస్తే BS-6 వాహనాలు 15 శాతం అధిక మైలేజ్‌ ఇచ్చే అవకాశం ఉన్నా... ట్యాంకులో కనీసం 2 నుంచి 3 లీటర్ల ఇంధనం ఎప్పుడూ నిల్వ ఉంచుకోవలసి ఉంటుంది. బీఎస్‌-4 వాహనాలైతే కనీస పరిమాణంలో ఇంధనం ఉన్నా నడిచే పరిస్థితి ఉండేది. కానీ.. బీఎస్‌-6 వాహనాల్లో మాత్రం కనీసం 2-3 లీటర్ల ఇంధనం ఉండాల్సిందే. 

 

దేశీయంగా ఉన్న అన్ని చమురు పంపిణీ సంస్థలు... బీఎస్‌-6 ఇంధనాన్ని మాత్రమే సరఫరా చేసేందుకు సన్నద్ధమయ్యాయి. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే బీఎస్‌-6 ఇంధనాలను ఏప్రిల్‌ 1 నుంచి సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌. తక్కువ స్థాయిలో సల్ఫర్‌ ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ను ఉత్పత్తి చేసేందుకు తమ రిఫైనరీలను 17 వేల కోట్లతో అప్‌గ్రేడ్‌ చేశామన్నారు ఐఓసీ ఛైర్మెన్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: