మహారాష్ట్ర రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అతని భార్య రశ్మికి కీలక బాధ్యతలను అప్పగించారు. శివసేన అధికార పత్రికకు ఎడిటర్ గా రశ్మిని నియమించారు. నిన్నటి నుండి రశ్మి శివసేన పత్రిక సామ్నా ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సామ్నా పత్రికకు ఎడిటర్లుగా పురుషులు మాత్రమే పని చేశారు. సామ్నాకు ఎడిటర్ గా పని చేసిన తొలి మహిళ రశ్మి కావడం గమనార్హం. ఈరోజు వెలువడిన సామ్నా పేపర్ లో రశ్మిని ఎడిటర్ గా పేర్కొన్నారు. 
 
రాజ్యసభ ఎంపీ, శివసేన సీనియర్ నాయకులు సంజయ్ రౌత్ కార్యనిర్వాహక ఎడిటర్ గా నియమితులయ్యారు. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే రాష్ట్రంలో పార్టీ వాయిస్ వినిపించాలనే లక్ష్యంతో సామ్నా పత్రికను 37 సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు. జనవరి 23, 1983న ఈ పత్రిక స్థాపించబడింది. బాల్ ఠాక్రే ఈ పత్రికకు మొదట సంపాదకుడిగా వ్యవహరించారు. 
 
సామ్నా స్థాపించిన 10 సంవత్సరాల తరువాత హిందీ ఎడిషన్ దోపాహార్ కా సామ్నా ప్రారంభమైంది. ఉద్ధవ్ ముఖ్యమంత్రి కావడంలో రశ్మి పాత్ర చాలా ఉంది. ఉద్ధవ్ రాజకీయాల్లో రాణించడం కోసం రశ్మి ఎంతో కష్టపడింది. ఉద్ధవ్, రష్మిల వివాహం 1989 డిసెంబర్ 13న జరిగింది. బాల్ ఠాక్రే జీవించి ఉన్నంతకాలం రశ్మి పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించటంతో పాటు పార్టీకి అండగా ఉన్నారు. 
 
బాల్ ఠాక్రే అనారోగ్యం పాలైన సమయంలో ఆయనను చూడటానికి వచ్చిన శివసైనికులకు భోజనం పెట్టి మరీ రశ్మి పంపించేవారు. ఉద్ధవ్ భార్యగానే కాక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును రశ్మి తెచ్చుకున్నారు. 2019 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్, రశ్మి దంపతులు కుమారుడు వర్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. ఎన్నికల్లో అదిత్య ఠాక్రే  విజయం సాధించగా రశ్మి విజయం కోసం ఎంతో కష్టపడ్డారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: