ప్రస్తుతం రాజకీయాల్లో మీడియా ప్రభావం ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు. ఓ రకంగా చెప్పుకోవాలంటే రాజకీయాలని మీడియానే నడుపుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. మీడియా ద్వారానే ఏ పార్టీ అయిన రాజకీయాలు చేస్తుంది. అందుకుతగ్గట్టుగానే పార్టీలకు సొంత మీడియా ఉండటమో లేక, వారికి సపోర్ట్ ఇచ్చే మీడియా ఉండటం సాధారణమైపోయింది. ముఖ్యంగా ఏపీలో ఈ మీడియా రాజకీయాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లేదు.

 

అధికారంలో ఉన్న వైసీపీకి, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా సంస్థలు ఉన్నాయి. ఇక ఆ మీడియా ప్రత్యర్ధి పార్టీపై విమర్శలు చేయడం, లేదా తమ అనుకూలంగా ఉన్న పార్టీపై పొగడ్తలు వర్షం కురిపించడం చేస్తుంది. అలా అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీలకు సపోర్ట్ చేసే మీడియా సంస్థలు ఏవో జనాలకు బాగా తెలుసు. అయితే ఇలా పార్టీల పరంగా మద్ధతు ఇచ్చే సంస్థల్లో టీడీపీకు అనుకూలంగా ఉండే ఓ మీడియా సంస్థ తాజాగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వార్త రాసింది.

 

ఎప్పుడు జగన్‌పై విరుచుకుపడే ఆ మీడియా ఇప్పుడు పాజిటివ్‌గా రాయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మేటర్‌లోకి వెళితే, ఇటీవలే జగన్ ప్రభుత్వం ఇంటివద్దకే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. వాలంటీర్ల ద్వారా ఒకరోజులోనే లబ్దిదారులకు పెన్షన్స్ అందించాలని జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుని పనిచేసింది. అయితే ఆ టార్గెట్‌ని మార్చి1న దిగ్విజయంగా పూర్తి చేసింది.

 

ఇక అదే అంశాన్ని టీడీపీ అనుకూలంగా ఉండే మీడియా, ఏపీ సర్కార్ రికార్డ్ అంటూ జగన్ ప్రభుత్వం గురించి పాజిటివ్‌గా రాసింది. జగన్ ఆదేశాలతో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుందని, పెన్షన్ల కోసం పడిగాపులు, క్యూలైన్లు, అలసత్వానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం చెక్‌ పెట్టిందని ప్రశంసించింది. పైగా పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల వ్యవస్థ సత్తాచాటిందని, ఒకటోతేదీ ఆదివారమైనా లబ్ధిదారులకు నగదు అందిందని, అలాగే గడపవద్దకే పెన్షన్లు సందర్భంగా ఫిబ్రవరిలో ఎదురైన సమస్యలకు అధికారులు చెక్‌  పెట్టారని పేర్కొంది.

 

అర్హులైన అందనివారికి, వెరిఫికేషన్‌ పూర్తైన వారికి ఒకేసారి రూ.4,500 అందించారని, డబ్బులు అందుకున్న పెన్షన్‌దారులు ఆనందంగా ఉన్నారని రాసింది. ఇక ఈ వార్త చూస్తుంటే జగన్‌ని ఎప్పుడు విమర్శించే మీడియా ఇంతలా పొగడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఆ మీడియాకు జగన్ మీద సడన్ లవ్ ఎందుకు వచ్చిందో దేవుడికే ఎరుక?

మరింత సమాచారం తెలుసుకోండి: