భారీ మెజారిటీతో అధికారంలోకి రావడమో లేక, ప్రతిపక్ష టీడీపీ వీక్ ఉండటమో తెలియదుగానీ కొన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోతుంది. ఈ మధ్య అయితే ఈ పోరు మరింత ఎక్కువైపోయింది. ప్రతి జిల్లాలోనూ వైసీపీ నేతల గొడవలు వీధికెక్కుతున్నాయి. ఇక ఈ ఆధిపత్య పోరుకు శ్రీకాకుళం(సిక్కోలు) జిల్లా కూడా ఏమి అతీతంగా లేదట. ఈ జిల్లాలో కూడా వైసీపీలో మూడు, నాలుగు గ్రూపులు ఉన్నాయట.

 

మంత్రి ధర్మాన కృషదాస్‌కు ఓ వర్గం ఉంటే, అటు ఆయన సోదరుడు, సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు మరో గ్రూపు ఉందట. ఇటు స్పీకర్ తమ్మినేని సీతారాంకు కూడా ఓ బ్యాచ్ ఉందట. ఇక వీరికి ఏమి తక్కువ కాకుండా యువ నేత దువ్వాడ శ్రీనివాస్ కూడా ఓ వర్గాన్ని నడుపుతున్నారట. జిల్లాలో ఏ పని జరగాలన్న వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు ఎవరికి తగ్గటుగా వారు, తమకు అనుకూలంగా ఉండే నేతల ద్వారా లాబీయింగ్ చేసుకుంటున్నారట.

 

అయితే ఓ గ్రూపు నేతకు పని జరుగుతుంటే, మరో గ్రూపు వారు చెడగొడుతున్నారట. అటు దువ్వాడ అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదట, సీఎంకు సన్నిహిత నేత అనే పేరుతో దువ్వాడ సీనియర్ నేతలకు ధీటుగా డామినేషన్ చేస్తున్నారట. ఇక దువ్వాడ వర్గం కూడా జిల్లాలో తామే తోపులు అన్నట్లుగా నడుచుకుంటున్నారట.  టెక్కలిలో ఎవరు కొలువు చేయాలన్నా దువ్వాడ శ్రీనివాస్ అనుగ్రహం కావాల్సిందేనట.

 

అటు జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలో సైతం దువ్వాడ జోక్యం బాగా ఎక్కువైపోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ పలాసలో బాగా డామినేట్ చేస్తున్నారట. దీంతో స్థానిక ఎమ్మెల్యే అప్పలరాజుకి చిర్రెత్తుకొస్తుందట. మునిసిపల్ వ్యవహారాల్లో దువ్వాడ సోదరుల జోక్యం మరి ఎక్కువైపోవడంతో అప్పలరాజు అసంతృప్తిగా ఉన్నారు. సీఎం సన్నిహితుడు అవ్వడం వల్ల అప్పలరాజు ఏ మాట్లాడలేకపోతున్నారని తెలుస్తోంది. మొత్తానికైతే సిక్కోలులో వైసీపీ నేతలు చాలానే సిత్రాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: