రాజకీయాల్లో నేతలకు కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే మంచి మంచి విజయాలు సాధించగలుగుతారు. ఇక దురదృష్టం ఉండే నేతలు కష్టపడిన ఉపయోగం ఉండదు. వారికి ముందే ఓటమి రాసిపెట్టి ఉంటుంది. అయితే అలా అదృష్టంతో విజయం, దురదృష్టంతో ఓటమి పాలైన నేతలు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోనే ఉన్నారు. వరుసకు బాబాయ్-అబ్బాయ్‌లు అయ్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబులు అందుకు ఉదాహరణగా నిలుస్తారు.

 

ఈ ఇద్దరు నేతలు తమ రాజకీయ జీవితాన్ని టీడీపీలోనే మొదలుపెట్టారు. అయితే 2009లో నెహ్రూ ప్రజారాజ్యంకు వెళ్ళి జగ్గంపేటలో పోటీ చేస్తే, చంటిబాబు టీడీపీ నుంచి పోటీకి దిగారు. వీరిద్దరు ఓ వైపు తలపడుతుంటే, అటు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తోట నరసింహం విజయం సాధించేశారు. ఇక 2014 ఎన్నికల్లో నెహ్రూ వైసీపీ నుంచి, చంటిబాబు టీడీపీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నెహ్రూ 15వేలపైనే మెజారిటీతో గెలిచేశారు.

 

అయితే ఆ తర్వాత అధికారం కోసం ఆశపడి నెహ్రూ టీడీపీలోకి వచ్చారు. బాబు మంత్రి పదవి ఇస్తారనుకుంటే, హ్యాండ్ ఇచ్చారు. సరే అని టీడీపీలోనే పని చేశారు. ఇదే సమయంలో చంటిబాబు టీడీపీలో ఉంటే లాభం లేదనుకుని అదృష్టం వైసీపీ రూపంలో రావడంతో, అందులోకి వెళ్ళిపోయారు. ఇలా సీన్ రివర్స్ కావడంతో, 2019 ఎన్నికల్లో నెహ్రూ టీడీపీ నుంచి, చంటిబాబు వైసీపీ నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ నెహ్రూకు టీడీపీ రూపంలో దురదృష్టం వెంట ఉండటంతో ఓటమి పాలయ్యారు. చంటిబాబు మంచి మెజారిటీతో విజయం సాధించారు.

 

ఓటమి పాలైన దగ్గర నుంచి నెహ్రూ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయింది. ఇటు టీడీపీలో ఉండలేరు. అటు జగన్ వైసీపీలోకి రానిచ్చే అవకాశం లేదు. దీంతో నెహ్రూ టీడీపీలోనే ఉంటూ దురదృష్టాన్ని వెనకేసుకుని తిరుగుతున్నారు. అయితే అప్పుడప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేశారనే వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించనట్లు తెలుస్తోంది. మరి చూడాలి నెహ్రూ దురదృష్టం ఎప్పుడు పోతుందో? 

మరింత సమాచారం తెలుసుకోండి: