ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం జగనన్న విద్యాదీవెన. డిగ్రీ చదివే అర్హులైన విద్యార్థులకు ఈ పథకం కింద కార్డులను కూడా పంపిణీ చేశారు. ఈ పథకంలో భాగంగానే కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన కార్డులో మహేష్ బాబు ఫోటో సోషల్ మీడియాలో రావడంతో నెటిజన్లు విమర్శల జల్లు కురిపించారు.

 

అయితే జగనన్న దీవెన కార్డులో విద్యార్థి ఫొటోకు బదులు సినిమా హీరో మహేష్ బాబు ఫొటో అప్‌లోడ్‌ చేయడంపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన కారణంగా సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ సస్పెండ్ అయ్యారు. బాధ్యులైన సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ప్రాథమిక స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీపై సైబర్‌ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

 

కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మద్దికెర మండలం పెరవళికి చెందిన లోకేశ్‌గౌడ్‌ పత్తికొండ శ్రీవైష్ణవి కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. లోకేశ్‌ కు జగనన్న విద్యాదీవెనలో కార్డు మంజూరైంది. అయితే, ఆ కార్డులో తన ఫొటో బదులు హీరో మహేశ్‌బాబు ఫొటో ఉండడంతో అవాక్కయి మీడియా దృష్టికి తెచ్చాడు.

 

దీనిపై సోషల్‌ మీడియాలోనూ వ్యంగ్యాస్త్రాలు హల్‌ చల్‌ చేశాయి. దీనిని సీరియస్‌ గా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విద్యార్థి ఫొటోను అప్‌ లోడ్‌ చేయాల్సిన కాలేజీ నిర్వాహకులు.. సినీహీరో మహేశ్‌బాబు ఫొటో అప్‌ లోడ్‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది.

 

కళాశాలపై సైబర్‌ చట్టం కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే తప్పుగా అప్‌ లోడ్‌ అయిన ఫొటోను గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ వార్డు సచివాలయ సోషల్‌ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేయాలని, మహేశ్‌బాబు ఫొటోతో కూడిన కార్డును అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా విద్యార్థికి అందించిన వాలంటీర్ ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలను జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: