అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సకుటుంబ సమేతంగా గ‌త‌ మంగళ, బుధవారాల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ట్రంప్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ అద్భుత దేశమని ప్రశంసించారు. మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడని కొనియాడారు. తమకు అద్భుతమైన ఆతిథ్యం లభించిందన్నారు. అయితే, ఆయ‌న ప‌ర్య‌ట‌న‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌ధానంగా ట్రంప్ టూర్‌తో భార‌త్‌కు ఒరిగిందేమీ లేద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో కోట్ల కొల‌ది రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

 

దీనిపై గుజ‌రాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ క్లారిటీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనకు గుజరాత్ రాష్ట్రం ప్రభుత్వం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు స‌రికాద‌ని అన్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని సిఎం విజయ్ రూపానీ అసెంబ్లీకి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం రూ.8 కోట్లు మంజూరు చేయబడ్డాయని, అందులో రూ.4.5 కోట్లు రోడ్ల కోసం ఎఎంసి(అహ్మదాబాద్ పున్సిపల్ కార్పోరేషన్) ఖర్చు చేసిందని విజయ్ రూపానీ తెలిపారు. ట్రంప్ పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు చేశారని వారు మాట్లాడుతుండటం తనకు చాలా అశ్చర్యమేసిందని  అన్నారు. వారికి ఈ సంఖ్య ఎక్కడ నుండి వచ్చిందో తనకు తెలియదని గుజ‌రాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఎద్దేవా చేశారు. 

 

ఇదిలాఉండ‌గా, తన పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయ పురోగతి నమోదైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సంతోషం వ్య‌క్తం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం అత్యద్భుతంగా ఉన్నాయన్నారు. భారత్‌తో పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని నిర్వహించనున్నామని, వారు (భారత్‌) ప్రస్తుతం వందల కోట్ల డాలర్లను అమెరికాకు పంపుతున్నారని చెప్పారు. భారత్‌ను అద్భుతమైన దేశంగా ట్రంప్‌ కొనియాడారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: