తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో రాజ్యసభ ఎన్నికల కోలాహలం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే రాజ్యసభ సీట్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడటంతో ఆశావహులు అధినేత ఆశీస్సుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఇద్దరికీ రాజ్యసభ స్థానాలు ఉండడంతో ఎవరికి వారు తామే రాజ్యసభకు వెళ్లాలి అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్ నాయకులు, కీలక నాయకులు చాలామంది ఆ స్థానాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత పేరు ఎక్కువగా వినిపిస్తున్నా ఆమె రాజ్యసభకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదని, రాష్ట్రంలోనే ఎమ్మెల్సీ ద్వారా మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 


ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కూడా మరోసారి తనకు అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉండటం, రాజకీయాల్లో సీనియర్ కావడంతో కేసీఆర్ మరోసారి రాజ్యసభకు పంపిస్తారని ఆయన ఆశగా ఉన్నారు. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు కోసం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు తనని రాజ్యసభకు ఎంపిక చేస్తారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. దీనికి జగన్ సిపార్సు కూడా ఉండడంతో ఖచ్చితంగా తనకే ఎంపీ సీటు వస్తుందని ఆయన తన అనుచరులతో చెప్పుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సీటు రేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. 


నమస్తే తెలంగాణ ఎండి దామోదరరావును కూడా రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లుగా టీఆర్ఎస్ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇలా ఎవరికి వారు తమకే రాజ్యసభ స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నా కేసీఆర్ మాత్రం ఈ విషయంలో తన మనసులో మాట ఏంటి అనేది బయటపెట్టడం లేదు. దీంతో ఈ వ్యవహారం సస్పెన్స్ గా మారింది. కేసీఆర్ దయ ఎవరిమీద ఉంటుందో అంటూ ఆశావహులు ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: