జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ఒక వైపు విశ్వసాన్ని ప్రకటిస్తూనే , మరొకవైపు అసెంబ్లీ లో సీ ఏ ఏ,  ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా తీర్మానం చేయాలంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి పై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  మైనార్టీ శాసనసభ్యులు ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నట్లు కన్పిస్తోంది . గుంటూరు లో జరిగిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సింహ గర్జన సభ లో తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ అసెంబ్లీ సీ ఏ ఏ , ఎన్ ఆర్సీ కి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని , ఒకవేళ అలా చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు .

 

అసెంబ్లీ సీ ఏ ఏ , ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి తీర్మానం చేస్తారన్న  పూర్తి నమ్మకం తమకు ఉందని చెప్పారు . ముఖ్యమంత్రిపై నిజంగానే పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఇంకా రాజీనామాల ప్రస్తావన ఎందుకు వస్తోందన్న ప్రశ్న తలెత్తుతోంది . ఈ మేరకు ఇప్పటికే పార్టీ నాయకత్వం కూడా అవసరమైతే సీఏ ఏ , ఎన్ ఆర్సీ కి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ప్రకటన చేసిన విషయం కూడా తెల్సిందే . అయినా మైనార్టీ ఎమ్మెల్యేలు అత్యుత్సాహం కొద్ది చేస్తోన్న ఈ తరహా ప్రకటన వల్ల వ్యక్తిగతంగా తమకు మైలేజి లభిస్తుందేమో కానీ పరోక్షంగా పార్టీ నాయకత్వాన్ని ఇరకాటం లోకి నెట్టినవాళ్ళం అవవుతామన్న విషయాన్నివిస్మరిస్తున్నట్లు కన్పిస్తోంది .

 

గతం లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కూడా ఇదే తరహా ప్రకటన చేసిన విషయం తెల్సిందే . ఒకవైపు  సీఏ ఏ, ఎన్ ఆర్సీ లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం చేస్తారంటూనే , మరొకవైపు అవసరమైతే రాజీనామా కు సిద్ధమంటూ ద్వంధ వైఖరి   వ్యక్తం చేశారు . ఈ తరహా ప్రకటన వల్ల రేపు అసెంబ్లీ లో ముఖ్యమంత్రి ముందుకు వచ్చి తీర్మానం చేసిన , మైనార్టీ ఎమ్మెల్యేల ఒత్తిళ్ల మేరకే తీర్మానం చేశారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: