సీఎం జగన్ కు సొంత పార్టీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. తమ ఇష్టాలకు వ్యతిరేకంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటే రాజీనామా చేస్తానని ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని చెప్పారు. జగన్ అందుకు అంగీకరించకపోతే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే ప్రకటన చేశారు. 
 
నిన్న గుంటూరులో జరిగిన వైసీపీ సింహ గర్జన సదస్సులో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. ముస్తఫా మాట్లాడుతూ సీఎం జగన్ ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా వ్యవహరించబోరన్న నమ్మకం తనకుందని అన్నారు. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కచ్చితంగా తీర్మానం చేస్తామని చెప్పారు. గతంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా వైసీపీ సీఏఏ, ఎన్నార్సీలకు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. 
 
ఎన్నార్సీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనకు ప్రజలే ముఖ్యమని పార్టీ, పదవులు ముఖ్యం కాదని వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేయడానికి తాను ఒప్పిస్తానని చెప్పారు. అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని ప్రకటన చేశారు. వైసీపీ ఎట్టి పరిస్థితులలోను ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధించి ముందుకెళ్లదని చెప్పారు. ప్రజలు ఈ విషయంలో తనను నమ్మాలని కోరారు. 
 
వైసీపీ ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రకటనలు చేయడానికి పార్టీ అనుమతి ఉందా...? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీపై ఒత్తిడి తెచ్చేలా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తూ ఉండటంపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందడానికి వైసీపీ సహకరించింది. వైసీపీ బీజేపీ నిర్ణయాలకు అనుకూలంగానే వ్యవరిస్తోంది. వైసీపీ వర్గాల్లో ఎమ్మెల్యే పదవికి ఎవరూ రాజీనామా చేయరని బహిరంగ సభల్లో సభికుల్ని ఆకట్టుకోవడానికి అలా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనల పట్ల ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: