మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓటమి చెందడంతో విజయవాడ యువ నాయకుడు వంగవీటి రాధాకు మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఎన్నికల తర్వాత నుంచి ఆయన పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. కానీ ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారంతో అమరావతి ప్రాంతంలో అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తూ మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర లేని రాధ ఇప్పుడు పొలిటికల్ గా రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఓటమి చెందిన తర్వాత పదేళ్లపాటు సైలెంట్ గా ఉండిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసినా ఓటమే పలకరించింది. ఇక ఆ తరువాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాధను తప్పించి మల్లాది విష్ణు కు ఆ బాధ్యతలు అప్పగించారు జగన్. 

IHG


ఇక ఆ తరువాత పరిణామాలతో టిడిపిలోకి వెళ్లారు రాధాకృష్ణ. అయితే టీడీపీలోకి వెళ్లడం రంగా, రాధా అభిమానులకు ఎవరికీ ఇష్టం లేదు. 2004 ఎన్నికలు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఆయన మళ్లీ గెలిచింది లేదు. అయితే ఇప్పటికే నాలుగు పార్టీలు మారారు రాధా. కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి వైసీపీ ఆ తర్వాత టిడిపి ఇలా ఏ పార్టీలోకి వెళ్లినా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. దీనంతటికీ కారణం రాధా ముక్కుసూటిగా ఉండడమే కాకుండా ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకపోవడం, సరైన వ్యూహం లేని రాజకీయాల కారణంగా ఆయన రాజకీయంగా దెబ్బ తిన్నారు. 

IHG


మొన్నటి ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో సీటు ఇచ్చేందుకు జగన్ ప్రయత్నించినా రాధ మాత్రం విజయవాడ సెంట్రల్ తప్ప తనకి ఏమీ వద్దు అని పట్టుబట్టి కూర్చోవడంతో ఆయనకు అవకాశం దొరకలేదు. టిడిపి లోకి వెళ్ళినా ఆయనకు సీటు దొరకలేదు. ఇక కొద్ది రోజుల క్రితం ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అమరావతిలో రైతుల తరపున పోరాటం చేసేందుకు, పొలిటికల్ గా మైలేజ్ పెంచుకునే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి జగన్ రెడ్డి అంటూ విమర్శిస్తూ గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: