వ్యవహారం చూస్తుంటే ఈ ఎంఎల్ఏ జగన్మోహన్ రెడ్డినే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లున్నాడు. ఎన్సీఆర్, సిఏఏ, ఎన్సీపీ చట్టం అమలుకు  వ్యతరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ గుంటూరు తూర్పు ఎంఎల్ఏ ముస్తాఫ్ ప్రభుత్వాన్ని హెచ్చరించటం సంచలనంగా మారింది. నిజానికి ఈ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ జగన్ కడపలో జరిగిన ఓ బహిరంగసభలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

 

అయితే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి ఇదే చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. గుంటూరులో జరిగిన సభలో అసదుద్దీన్ తనిష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసద్ మాట్లాడటంలో వింతేమీ లేదు. ఎందుకంటే ఆ పార్టీని ముస్లిం మైనారిటిల పార్టీ అన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా అసదే పార్టీకి అధ్యక్షుడు కూడా.

 

అయితే అసద్ తర్వాత మాట్లాడిన ముస్తాఫా కూడా తనిష్టం వచ్చినట్లు మాట్లాడటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. వివాదాస్పదమైన అంశాలపై మాట్లాడేటపుడు పార్టీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, నేతలపైనే ఉంటుంది. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేస్తుంటే ఇక పార్టీ అధ్యక్షుడెందుకు ?  రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని బహిరంగంగా డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.

 

పైగా తీర్మానం చేయకపోతే ఎంఎల్ఏల పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించటమంటే జగన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే అనుకోవాలి. అంటే ముస్లింల్లో తన ఇమేజి పెంచుకునేందుకని జగన్ కూడా ఇరకాటంలో పడేయటానికి ఈ ఎంఎల్ఏ వెనకాడటం లేదన్నది స్పష్టమైంది. మొన్నటి ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలంతా వైసిపికి ఓట్లేశారంటే జగన్ ను చూసేకానీ ఈ ఎంఎల్ఏని చూసి కాదన్నది వాస్తవం. కాబట్టి ఇటువంటి ఎంఎల్ఏలను జగన్ ఆదిలోనే కట్ చేయకపోతే ముందు ముందు చాలా సమస్యలు రావటం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: