ఈ సారి సమ్మర్ లో ఎండలు మండిపోనున్నాయా....? రాయలసీమ కంటే కూడా కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భానుడి ప్రతాపం ఎక్కువగానే ఉండబోతోందా...? సాధారణ పరిస్థితిని మించి వడగాల్పులు ఈడ్చి కొట్టనున్నాయా ...?  " మాన్ సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్ కాస్టింగ్ సిస్టమ్ " రూపొందించిన మోడల్ ద్వారా వేసిన అంచనా నిజమవుతుందా...? రాబోయే మూడు నెలలకు సంబంధించి వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్ ఏం చెబుతుందో తెలుసా.?  

 

వేసవి రాకుండానే సూర్యారావ్ సుర్రుమనిపిస్తున్నాడు . ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచే ఎండలతో దడపుట్టిస్తున్నాడు . తాజాగా మార్చ్ లో ఎంటరవుతూనే ఈ సారి మాడు పగలగొడతానంటూ సంకేతాలను మోసుకొచ్చాడు.  ఈసారి మార్చి, ఏప్రిల్ , మే నెలలకు గానూ దేశంలో ఎండతీవ్రత , ఉష్ణోగ్రతలు , వడగాల్పుల పై ఓ బులిటెన్ విడుదల చేసింది భారత వాతావరణ శాఖ -ఐఎండీ.  రాబోయే 3 నెలల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఓ అంచనా వేసింది .  ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాన్‌సూన్‌ మిషన్‌ కపుల్డ్‌ ఫోర్‌కాస్టింగ్‌ సిస్టమ్‌ ...ఒక మోడల్‌ ను రూపొందించింది.  ఈ అంచనా ప్రకారం కోర్ హీట్ వేవ్ జోన్ లో ఉన్న కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సీమతో పోల్చితే ఉష్ణోగ్రతలు సాధారణం లేదా కొంచెం అధికంగా నమోదు కానున్నాయి . 

 

ముఖ్యంగా వాయవ్య, మధ్య భారతం, తూర్పు ఈశాన్య భారతంతో పాటు దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉండనున్నాయి . పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి .  సాధారణం కంటే 1డిగ్రీ ఎక్కువగా నమోదవుతాయి . కోర్‌హీట్‌ వేవ్‌ జోన్‌గా గుర్తించిన పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీలో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు సాధారణానికి మించి వీయడానికి 38శాతం అవకాశం ఉందని ఐఎండీ అంచాన వేస్తోంది.


ఇక ఏపీలో ఎండలు పెరిగి, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే  ఒక డిగ్రీ ఎక్కువగా నమోదవుతాయి. రాయలసీమతో పోల్చితే కోస్తాంధ్రలో ఎండలు సాధారణంగా ఉండనున్నాయి... ఐతే సముద్రతీరప్రాంతమైన సాగరతీరం విశాఖలో మాత్రం మాన్ సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్ కాస్టింగ్ సిస్టమ్ రూపొందించిన మోడల్ ప్రకారం  ఎండలు కచ్చితంగా మండిపోనున్నాయి . ఉష్టోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉండనుంది . ఇదిలా ఉంటే నైరుతీ రుతుపవనాలు కూడా జూన్ మొదటి వారం తర్వాతే ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ఓ అంచనాకు వచ్చేసింది . 

 

ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో తటస్థంగా ఉంది .  వేసవి సీజన్‌ మొత్తం ఇవే పరిస్థితులు కొనసాగనున్నాయి . దీంతో రానున్న 4 వారాలకు గాను ఎండలు, వాతావరణ పరిస్థితులపై ప్రతి వారం ఒక బులిటెన్ ను విడుదల చేయాలని వాతావరణశాఖ నిర్ణయించినట్లు సమాచారం .  

 

మరింత సమాచారం తెలుసుకోండి: