ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ప్రతిరోజూ నియోజకవర్గంలో పనిచేసే ఎమ్మెల్యేలు ఎవరంటే? ముగ్గురు ఎమ్మెల్యేలు పేర్లు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రెండు కృష్ణాకు చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మూడు పశ్చిమ గోదావరికి చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. టీడీపీలో ఏ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా అయిన ఉండనివ్వండి గానీ, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నిత్యం ఏదొక విషయంలో నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు. ఏదైనా వ్యక్తిగత పనులు ఉంటే తప్ప, మిగతా సమయాల్లో నియోజకవర్గాల్లోనే కనిపిస్తారు.

 

ఎలాంటి సమయాల్లోనైనా చంద్రబాబుకు భుజం కాస్తున్న నిమ్మల రామానాయుడు పాలకొల్లులో తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారు. చంద్రబాబు ఏదైనా ప్రభుత్వంపై పోరాటం కార్యక్రమానికి పిలుపునిస్తే చేయడానికి ముందుంటారు. అలాగే జగన్ ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్ మూసేసినా, నిత్యం పాలకొల్లులోని క్యాంటీన్ వద్ద దాతలు సాయంతో పేదల కడుపు నింపుతున్నారు. అలాగే సమస్యలు పరిష్కరించడంలో అధికారంలో అలసత్వం వహిస్తే, వినూత్నంగా నిరసన చేసి, అధికారుల చేత పనులు చేయించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రజా చైతన్య యాత్రలో రోజూ ప్రజల మధ్యలోనే ఉంటున్నారు.

 

ఇటు గద్దె అయితే నిత్యం ప్రజల కోసం కష్టపడుతూనే ఉంటారు. ప్రభుత్వ నిధులు అందకపోయిన, తమ ఎంపీ కేశినేని నాని నిధులతో నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. అలాగే అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. తాజాగా రేషన్, పెన్షన్ తొలగింపుపై బాధితులకు అండగా నిలుస్తూ, అధికారులతో మాట్లాడి వారికి సాయం చేస్తున్నారు.

 

అటు ఏలూరి సాంబశివరావు పర్చూరులో దూసుకెళుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. అవసరమైతే సొంత డబ్బులతో పనులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి పేరిట ట్రస్ట్ పెట్టి పేదలకు ఉచిత కంటిపరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే అగ్రికల్చర్‌లో ఉన్నత చదువులు చదివిన ఏలూరి, నియోజకవర్గంలో రైతులకు సాయం చేస్తున్నారు. ఇక ఇటీవలే జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే. దక్షిణాది నుంచి ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక ఎమ్మెల్యే ఏలూరే కావడం గమనార్హం. ఏదేమైనా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేయడంలో మాత్రం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రూట్ ఒకటే.

మరింత సమాచారం తెలుసుకోండి: