తెలంగాణ ఈ‌ఎస్‌ఐ స్కామ్ మాదిరిగానే ఏపీలో కూడా  భారీ స్కామ్ ఇటీవలే బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ‌ఎస్‌ఐలో మందుల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందని, అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ బాధ్యతలను పితాని సత్యనారాయణ స్వీకరించాక కూడా అక్రమాలు కొనసాగాయనడానికి ఆధారాలు లభ్యమయ్యాయని తెలిసింది.

 

అయితే ఈ స్కామ్ విచారణ దశలో ఉంది కాబట్టి, నిజనిజాలు అనేవి నిదానంగా బయటపడతాయి. కాకపోతే ఈ స్కామ్ టీడీపీలో చిచ్చుపెట్టినట్లు కనిపిస్తుంది. ఈ స్కామ్ తెరపైకి రాగానే, టీడీపీ నేతలందరూ అచ్చెన్నాయుడుకు అండగా నిలిచారు. ఆయనపై వైసీపీ ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలకు దిగిందని విమర్శించారు. అయితే అచ్చెన్నాయుడుతో పోలిస్తే పితానికి పెద్దగా పార్టీ నేతల అండ దొరకలేదు. ఏదో అధినేత చంద్రబాబు సోషల్  మీడియాలో స్పందించి వదిలేశారు తప్ప, మిగతా నాయకుల్లో చాలామంది అచ్చెన్నకు ఇచ్చిన సపోర్ట్ పితానికి ఇవ్వలేదు.

 

ముఖ్యంగా ఆయన సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేతలు అయితే పితానికి అండగా నిలవలేదని తెలుస్తోంది. దీంతో ఆయన ఒక్కడే దీనిపై ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనపడుతుంది. అసలు విజిలెన్స్ నివేదికలో తన పేరే లేదని, కానీ నిజనిజాలు వెలికితీస్తే తనకు అభ్యంతరం లేదని, ఏ విచారణకైనా సిద్ధమని ఆయనే వైసీపీ ప్రభుత్వంకు సవాల్ విసిరారు.

 

ఇలా తాను ఒక్కడే మాట్లాడుకోవడం తప్ప, జిల్లాలోని నేతలు ఏ విధంగానూ స్పందించలేదని పితాని అనుచరులు ఆగ్రహంతో ఉన్నారట. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ మా నాయకుడుకు తిరుగుండేది కాదని, టీడీపీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. పైగా ఎన్నికల ముందు పితానికి వైసీపీ నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ ఆయన అటు వెళ్లకుండా టీడీపీలోనే ఉన్నారని నియోజకవర్గంలో టాక్. అయితే ఇప్పుడు ఇలా టీడీపీలో ఇబ్బంది రావడంతో, ఆయన అనుచరులు వైసీపీలోకి పోతేనే బెటర్ అంటూ గుసగుసలాడుకుంటున్నారట. మరి చూడాలి మాజీ మంత్రి పితాని భవిష్యత్ ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: