అధికారం కోల్పోయి 9 నెలలు దాటుతున్న చాలా చోట్ల తెలుగు తమ్ముళ్ళు యాక్టివ్ కావడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు నియోజకవర్గాల్లో పని చేస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదు. ముఖ్యంగా ఒక్క సీటు తెచ్చుకుని జిల్లాల్లో టీడీపీ నేతలు అడ్రెస్ లేకుండా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో టీడీపీ కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదన్న సంగతి తెలిసిందే.

 

అయితే ప్రతిపక్షంలోకి వచ్చి 9 నెలలు దాటిన ఈ జిల్లాల్లో నేతలు పెద్దగా కష్టపడుతున్నట్లు కనపడటం లేదు. మిగిలిన జిల్లాలు పక్కనబెడితే టీడీపీకి బలం ఉన్న విజయనగరంలో తెలుగు తమ్ముళ్ళు సైకిల్ తొక్కలేక పక్కనపడేసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో అతి తక్కువ సీట్లు తెచ్చుకుంది. కానీ 9 సీట్లు ఉన్న విజయనగరంలో 6 టీడీపీనే గెలిచింది. ఉన్న ఒక్క ఎంపీ సీటు కూడా టీడీపీ ఖాతాలోనే పడింది.

 

కానీ 2019 ఎన్నికలకొచ్చేసరికి తుడుచుపెట్టుకుపోయింది. మొత్తం వైసీపీ ఖాతాలోకే పోయాయి. అయితే ఓడిపోయాక కొన్ని రోజులు సర్దుకుని మళ్ళీ పార్టీ కోసం రావాల్సిన నేతలు సైలెంట్‌గానే ఉండిపోయారు. ఏదో పెద్దాయన అశోక్ గజపతి రాజు, విజయనగరం అసెంబ్లీలో ఓడిపోయిన ఆయన తనయురాలు అతిథి కాస్త పోరాటం చేస్తున్నారు. ఇక బొబ్బిలిలో ఓడిపోయిన మాజీ మంత్రి సుజయ కృష్ణరంగారావు పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు.

 

గజపతినగరంలో ఓడిన అప్పలనాయుడు, పార్వతిపురంలో చిరంజీవులు, శృంగవరపుకోటలో కోళ్ళ లలితా కుమారి, సాలూరులో రాజేంద్ర ప్రతాప్ భాంజ్, నెల్లిమర్లలో నారాయణస్వామి నాయుడు, కురుపాంలో జనార్ధన్ ధాట్రాజ్, చీపురుపల్లిలో కిమిడి నాగార్జున వీరెవరు పెద్దగా అడ్రెస్‌లో లేరు. ఏదో పార్టీ కార్యక్రమం పెడితే కనబడుతున్నారు తప్ప, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు లేదు. మొత్తానికైతే విజయనగరంలో తెలుగు తమ్ముళ్ళు సైకిల్ తొక్కాడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: