అధికారం ఓ మత్తు. అది ఎక్కాక దిగడం చాలా కష్టం. టీడీపీ విషయానికి వస్తే అయిదేళ్ళ పాటు విచ్చలవిడిగా అధికారం అనుభవించారు. ఆఖరుకు జన్మభూమి కమిటీ మెంబర్స్ కూడా చినబాబు లెవెల్లో ఫీల్ అయ్యే సీన్ ఉండేది. ఇపుడు ఓడి తొమ్మిది నెలలు అయినా ఆ మత్తు దిగడంలేదు. ఇంకా అవే భారీ డైలాగులు, తిట్లు, దూషణలు, ఏకంగా అధికారుల మీదనే వీరంగాలు, ఇదీ పచ్చ పార్టీ తమ్ముళ్ళ కధ.

 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్ ఈ రోజు మరో మారు అరెస్ట్ అయ్యారు. ఆయన‌ సరిబుజ్జిలి మండలం ఈపీఆర్డీ జి వెంకటప్పలనాయుడు మీద నోరు పారేసుకున్న ఫలితంగా పోలీసులు కేసు నమోదు చేసి మరీ అరెస్ట్ చేసారు. కూన రవికుమార్ గత సోమవారం టీడీపీ నిరసన కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈపీఆర్డీకి ఫోన్ చేసి తిట్ల పురాణం లంకించుకున్నారు. తన ఫోన్ ఎత్తలేదన్న ఆగ్రహంతో నాన దుర్భాషలూ ఆడారు. చివరికి ఆయన దీన్ని అంతా రికార్డ్ చేసి ఆడియో పెట్టడంతో అది వైరల్ అయి ఉద్యోగ సంఘాలు మూకుమ్మడిగా కూన అరెస్ట్ కు డిమాండ్ చేశాయి.

 

దీంతో పోలీసులు కూనను అరెస్ట్ చేశారు. చిత్రమేంటంటే దీనికి ముందు కూడా కూన అప్పట్లో ఓ ఎంపీడీవో మీద నోరు పారేసుకుని అరెస్ట్ అయ్యారు. ఇపుడు ఆయన బెయిల్ మీద  ఉన్నారు. అయినా తీరు మార్చుకోకుండా అధికారుల మీద ఇలాగే వీరంగమాడుతున్నారని ఉద్యోగ సంఘాల‌ నేతలు మండిపడుతున్నాయి. 

 

ఇక కూన విషయానికి వస్తే ఆయన ఇంకా తాను ఎమ్మెల్యేనని ఫీల్ అవుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఓడి తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఆయనలో మార్పు రాలేదని అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే రెచ్చిపోయి నిండు సభలో పాతేస్తామని హెచ్చరించిన ఘటనలూ ఉన్నాయి. అలాగే తహసిల్దార్ వనజాక్షి మీద దాడి చేసిన ఉదంతాలు ఉన్నాయి.

 

ఓడాక కూడా ఏ సెంటర్ లోనైనా సరే అంటూ బోండా ఉమా లాంటి వారు సవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అన్నింటికీ మించి చంద్రబాబు అయితే మళ్ళీ మళ్ళీ  పోలీసులకు హెచ్చరికలే పంపుతున్నారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు లాంటి వారు, దేవినే ని ఉమా వంటి వారు కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, వారంతా తాము పవర్లో లేమని గుర్తిస్తే మంచిదని వైసీపీ నేతలు అంటున్నారు. మరి తమ్ముళ్ళు మారుతారా ..

మరింత సమాచారం తెలుసుకోండి: