టీడీపీని బ్రతికించుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు తన చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఆ బ్రహ్మాస్త్రం ఏమిటంటారా.. ఆమే నారా బ్రహ్మణి. చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ భార్య, నందమూరి అందగాడు నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు. ఇక ఇప్పుడు టీడీపీని బతికించడానికి ఈ అస్త్రమే ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

ఓవైపు అధికారం కోల్పోయిన దీన స్థితి. మరోవైపు పుత్ర రత్నం చేతికి అందుబాటులోని రాని దుస్థితి.. పోనీ.. కాస్త సమయం తీసుకున్నా లోకేశ్ రాణిస్తాడన్న నమ్మకమే రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఈ దశలో ప్రత్నామాయ ఏర్పాట్ల గురించి ఆలోచించిన సమయంలో చంద్రబాబుకు తట్టిన ఒకే ఒక్క పేరు నారా బ్రహ్మణి. నందమూరి బాలయ్య కూతురుగా ఆకట్టుకునే రూపం.. ఎన్టీఆర్ మనవరాలిగా సమయస్ఫూర్తి నారా బ్రహ్మణి సొంతం.

 

 

హెరిటేజ్ కంపెనీని నడిపిస్తున్నా... ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా బ్రహ్మణి తనదైన ముద్ర చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె సేవలు తెలుగు దేశం పార్టీకి ఉపయోగపడాల్సిన సమయం వచ్చేసినట్టు చంద్రబాబు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవైపు నారా లోకేశ్ పరిస్థితి చూస్తే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్నట్టు తయారవుతోంది. పోనీ.. పార్టీలో మరో నేతను ప్రోత్సాహిద్దామా అంటే అధికారం తన కుటుంబాన్ని దాటి పోవడం చంద్రబాబుకు ఇష్టం లేని వ్యవహారం.

 

 

ఈ దశలో చంద్రబాబు నమ్ముకుంటున్న అస్త్రం బ్రహ్మాస్త్రం నారా బ్రహ్మణి. అందులో భాగంగానే ఆమెను పార్టీ యువ నాయకత్వానికి దగ్గర చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన పార్టీ యువ నాయకుల విందు సమావేశం ఇందులో మొదటి అంకంగా చెప్పుకోవచ్చు. మరి తెదేపాను కాపాడుకోవడం కోసం చంద్రబాబు ప్రయోగిస్తున్న ఈ బ్రహ్మాస్త్రం ఎంత వరకూ పని చేస్తుందన్నది కాలమే జవాబు చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: