చైనాలో మొదలైన భయంకర మహమ్మారి క‌రోనా దాదాపు 70 దేశాలకు విస్తరించింది. ఇలా మొత్తంగా ప్రపంచాన్నే తన గుప్పిట్లోకి తీసుకుంది. దీంతో అన్ని దేశాలు నియంత్రణ చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. చైనా వెలుపల కూడా వైరస్‌ సోకడంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటలీలో బాధితుల సంఖ్య ఒక్కసారిగా 40శాతం పెరిగింది. తాజాగా ఈ వైరస్‌ సోకి అగ్రరాజ్యం అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, థాయిలాండ్‌లో ఒక్కో పౌరుడు చొప్పున మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. 

 


70దేశాలకు పైగా విస్తరించిన మహమ్మారి కారణంగా  సోమవారం వరకు సుమారు 3వేల మంది మృతి చెందారు. ఒక్క చైనాలోనే ఇప్పటి వరకు 2,912 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకిన వారి సంఖ్య  80వేలు దాటింది.  చైనా తర్వాత అత్యధిక కరోనా కేసులు  ఇరాన్‌, దక్షిణ కొరియాలో నమోదయ్యాయి. ఇరాన్‌లో తాజాగా 11 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 54కు చేరింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో 60 ఏళ్లు దాటిన వారు,  హైపర్‌ టెన్షన్‌ ఉన్నవారే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చాలా దేశాల్లో తొలి కేసులు నమోదవుతున్నాయి.  కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు ట్రావెల్‌ బ్యాన్‌ విధించాయి. చాలా దేశాలు ఇప్పటికే చైనాకు రాకపోకలను నిషేధించాయి.

 


అమెరికాలో తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ వైద్యాధికారులే ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మృతుని వివరాలను తెలుపలేదు. వైరస్‌ సోకిన బాధితుల సంఖ్యపైనా స్పష్టతనివ్వలేదు. మరోవైపు ఇరాన్‌, దక్షిణ కొరియాకు అవసరమైతేతప్ప ప్రయాణించవద్దని పౌరులకు సూచించింది. కరోనాకు ప్రభావితమైన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం దాదాపు 160 మందిని స్వదేశానికి తరలించింది. వైద్యుల పర్యవేక్షణలో వారికి చికిత్స అందిస్తు న్నది. వారిలో 78 ఏళ్ల‌ వ్యక్తి మరణించినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియాలో తొలి కరోనా మరణం రికార్డు అయింది. మరోవైపు.... ఐర్లాండ్‌, థాయిలాండ్‌లో సైతం మొదటి కరోనా మరణం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే సామ‌ర్థం ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్‌ స్పందించారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసే సామర్థ్యం అమెరికన్లకు లేదని చెప్పారు. ప్రైవేటు ఫార్మా సంస్థలు దీన్ని అభివృద్ధి చేస్తే టీకా ఖరీదు అంచనాలకు మించి ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: