తెలంగాణ లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి . భూఆక్రమణలకు పాల్పడింది నువ్వంటే , నువ్వంటూ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు . కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్ రెడ్డి లు భూఆక్రమణలకు పాల్పడినట్లుగా అధికార పార్టీ  నేతలు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే . ఈ మేరకు అధికార యంత్రాంగం విచారణ నిర్వహించి రేవంత్ ఆయన సోదరుడు గోపన్నపల్లి తో పాటు పలు ప్రాంతాల్లో భూఆక్రమణలకు పాల్పడ్డారని నిర్ధారణ చేశారు .

 

ఈ మేరకు  ప్రభుత్వం ఉన్నతస్థాయి అధికారిని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది . అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే రేవంత్ రెడ్డి , చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లో జన్వాడ లోని మంత్రి కేటీఆర్ జీవో నెంబర్ 111 నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ఫామ్ హౌస్ అక్రమాలను మీడియాకు వెల్లడించారు . కేటీఆర్ ఫామ్ హౌస్ వద్దకు మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లే క్రమం లో రేవంత్ , విశ్వేశ్వర్ రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . నాలాను  కబ్జా చేసి 25  ఎకరాల్లో కేటీఆర్ రాజమహల్ లాంటి  మూడంతస్థుల ఫామ్ హౌస్ కట్టుకున్నారని రేవంత్ ఆరోపించారు . అయితే రేవంత్ చేసిన ఆరోపణలను టీఆరెస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు .

 

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు . నాలుగేళ్ళ క్రితం ఫామ్ హౌస్ ను కేటీఆర్ లీజు కు తీసుకున్నారని వివరించారు . ఇక కేటీఆర్ ఎక్కడ సెంటు భూమి కూడా కబ్జా చేయలేదని పేర్కొన్నారు . రేవంత్ ఆరోపిస్తున్న భూముల గురించి 2014 , 2018  ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ పేర్కొన్నారని వెల్లడించారు . రేవంత్ అక్రమాలు మరిన్ని త్వరలోనే వెలుగులోకి వస్తాయని చెప్పారు  బాల్క సుమన్ .   

మరింత సమాచారం తెలుసుకోండి: