ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఒకనాడు హవా చలాయించారు. ఆయన మాటకు ఎదురులేకుండా  జిల్లాలో పరిస్థితి ఉండేది. అటువంటి నాయకుడు ఇపుడు సొంత పార్టీ మీద రగిలిపోతున్నారు. ఆయన గెలిచినా కూడా సుఖం లేదని అభిమానులు గుస్సా అవుతున్నారు. ఎందుకొచ్చిన అనుభవం, అవమానాలు జరుగుతున్నపుడు, అధినాయకత్వం గుర్తించనపుడు అనుకుంటూ  తెగ బాధపడుతున్నారుట. 

 


శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు  కాంగ్రెస్ ఏలుబడిలో తన  పలుకుబడి పెంచుకుని పలుమార్లు ఎమ్మెల్యేగా, వివిధ మంత్రిత్వ శాఖలను చూసిన అమాత్యునిగా ధర్మాన పెద్ద కీర్తినే గడించారు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నపుడు జగన్ని నానా మాటలూ అన్నారు. భవిష్యత్తు రాజకీయం అర్ధం చేసుకోలేక అలా చెలరేగిపోయారని అంటారు. ఆ తరువాత విభజన సమయంలో  వైసీపీ గూటికి చేరి  2014 ఎన్నికల్లో పోటీ  చేసినా క్యాడర్ సహకరించక ఓటమిపాలు అయ్యారు.

 

 

ఆ ఎన్నికల్లో వైసీపీ కూడా గెలవలేదు కాబట్టి కొంత ఫరవాలేదనిపించి ఉంటుంది.  ఇక జిల్లా రాజకీయాల్లో నాడు ధర్మాన తన వంతు పాత్రను సరిగ్గా పోషించలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఆయన అ గారు క్రిష్ణ దాస్ కే జగన్ కూడా ఎక్కువగా  ప్రాధాన్యతా ఇచ్చారు. దాంతో మండిన ధర్మాన అడపా దడపా జగన్ మీదనే వ్యంగ్య బాణాలూ వేస్తూ వచ్చారు. ఒకసారి అయితే జగన్ పులివెందుల నుంచి గెలవడం కాదు, శ్రీకాకుళం వచ్చి గెలిచి చూడమంటూ పెద్ద సవాల్ కూడా చేశారు. అది జగన్ చెవిన పడి సీరియస్ యాక్షన్ దాక కధ నడిచింది కానీ తరువాత ధర్మాన వివరణ ఏదో ఇచ్చుకోవడంతో అంతటితో వ్యవహారం  సద్దుమణిగింది.

 


ఇక వైసీపీ బంపర్ మెజారిటీతో గత ఏడాది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. నేనే రాజూ, నేనే మంత్రి అనుకుంటూ  ధర్మాన మురిసిపోయినంతసేపూ పట్టలేదు అది ఆవిరి కావడానికి. అలా చూస్తుండగా అన్నగారు మంత్రి కుర్చీ ఎక్కేశారు. ధర్మాన మాజీగానే మిగిలారు. ఆ అసంత్రుప్తి అలా కట్టలు తెంచుకుంటూనే ఉంది. అయినా ఏం చేయలేని నిస్సహాయతో పెద్దాయన నిర్లిప్తంగా  గడుపుతున్నారు. అక్కడికీ అసెంబ్లీలో జగన్ని పొగిడి మరీ ఎంతగానో చేరువ కావాలని చూస్తున్నా అధికార పీఠం మాత్రం అక్కున చేర్చుకోవడంలేదు.

 


ఇదిలా ఉండగా శ్రీకాకుళంలో ఈ మధ్య  వైసీపీ కార్యకర్తల మీటింగ్ ఈ మధ్య జరిగింది. ఈ మీటింగులో కొంతమంది కార్యకర్తలు తమకు వైసీపీ సర్కార్ లో ఏ పదవులూ దక్కలేదని అసంత్రుప్తిని వెళ్ళగక్కారు. దానికి మంత్రి క్రిష్ణదాస్ బదులిస్తూ ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తోందని, అనేక పధకాలు అమల్లో పెడుతోందేని అది గర్వకారణంగా తీసుకోవాలని సూచించారు. కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే అదే సభలో ధర్మాన మాట్లాడుతూ కార్యకర్తలకు తీరని అన్యాయం జరిగిందని ప్రకటించడం విశేషం.

 

 

తాను దాన్ని అంగీకరిస్తున్నానని అనడం ద్వారా వారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చకు దారితీస్తోంది. ధర్మాన సైతం అసంత్రుప్తిగా ఉన్నారు. ఆయన తన బాధ వారిలో చూసుకున్నారని అంటున్నారు. ఓ విధంగా జగన్ కి వ్యతిరేకంగానే ఈ వ్యాఖ్యలను చూస్తున్నారుట. మరి ధర్మాన దావాలనలం ఇలా పెల్లుబుకిందా అని కూడా అంటున్నారు. చూడాలి  మరి పెద్దాయన‌ మరెంత దూరం వెళ్తారో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: